LOADING...
Sheikh Hasina: ఢిల్లీలో షేక్ హసీనా బహిరంగ ప్రసంగంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆగ్రహం
ఢిల్లీలో షేక్ హసీనా బహిరంగ ప్రసంగంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆగ్రహం

Sheikh Hasina: ఢిల్లీలో షేక్ హసీనా బహిరంగ ప్రసంగంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో చేసిన తాజా ప్రసంగం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పరారీలో ఉన్న ఒక 'నేరస్తురాలికి' భారత రాజధానిలో బహిరంగంగా మాట్లాడే అవకాశం కల్పించడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2024 ఆగస్టులో ప్రజా తిరుగుబాటు అనంతరం అధికారాన్ని కోల్పోయిన షేక్ హసీనా (78) భారత్‌కు వచ్చి అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు. అయితే శుక్రవారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆడియో సందేశం ద్వారా ప్రసంగించారు.

వివరాలు 

భారత్ నుంచి స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాంగ్లాదేశ్ 

మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగవని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా కలకలం రేపింది. మానవత్వానికి వ్యతిరేక నేరాలకు పాల్పడి, కోర్టు ద్వారా మరణశిక్ష పొందిన వ్యక్తికి భారత గడ్డపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే అవకాశం ఇవ్వడం ఆశ్చర్యకరమని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. షేక్ హసీనాను అప్పగించాలని తాము ఎన్నిసార్లు కోరినా భారత్ నుంచి స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా ఆమెకు ఇలాంటి వేదికలు కల్పించడం బంగ్లాదేశ్ భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

వివరాలు 

బంగ్లాదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అంతర్జాతీయ నిపుణుల నుంచి విమర్శలు

అయితే హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అంతర్జాతీయ నిపుణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం, అక్కడి ప్రజాస్వామ్యం, స్థిరత్వానికి భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆమెను అప్పగించే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.

Advertisement