Bangladesh: బంగ్లాదేశ్ తొలి మహిళా స్పీకర్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో తొలి మహిళా స్పీకర్‌గా చరిత్ర సృష్టించిన షిరిన్ షర్మిన్ చౌధురిను మంగళవారం అరెస్ట్ చేశారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ అధికారులు ఆమెను ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో ధన్మోండిలోని ఆమె నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ ఆంటీ-డిస్క్రిమినేషన్ స్టూడెంట్ ఉద్యమానికి సంబంధించిన కేసుతో సంబంధం ఉందని అదనపు కమిషనర్ ఎం.డి షఫికుల్ ఇస్లాం తెలిపారు. రంగ్‌పూర్-6 నియోజకవర్గానికి చెందిన ఎంపీగా ఉన్నచౌదురీ 2013 ఏప్రిల్ 30న దేశ పార్లమెంట్‌కు తొలి మహిళా స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 2009లో మహిళల కోసం కేటాయించిన రిజర్వ్ సీటుతో పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ఆమె,తరువాత మహిళా,శిశు వ్యవహారాల శాఖలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
వివరాలు
హసీనా దేశం విడిచిపెట్టిన తర్వాత.. పార్లమెంట్‌ను రద్దు చేసిన మహ్మద్ షహాబుద్దీన్
షేక్ హసీనా ప్రభుత్వ పతనం అనంతరం 2024 సెప్టెంబర్ 2న ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగం ప్రకారం కొత్త స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసే వరకు పదవిలో కొనసాగాల్సి ఉన్నప్పటికీ, ముందుగానే ఆమె తప్పుకున్నారు. జూలై తిరుగుబాటు తర్వాత అవామీ లీగ్ నాయకులు చాలా మంది దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో చౌదురీ కూడా ప్రజల ముందుకు రాకుండా ఉండిపోయారు. 2024 ఆగస్టు 8న జరిగిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ ఆమె హాజరు కాలేదు. ఇదిలా ఉండగా, హసీనా దేశం విడిచిపెట్టిన తర్వాత ఒక రోజు గడిచేలోపే మహ్మద్ షహాబుద్దీన్ పార్లమెంట్‌ను రద్దు చేశారు.