Waker-uz-Zaman: మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ తెలిపారు. ఇప్పుడు దేశంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరగనుందని పేర్కొన్నారు. మధ్యంతర ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టనుంది. తాను రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడానని, శాంతిభద్రతల బాధ్యతను సైన్యం తీసుకుంటుందని చెప్పానని ఆర్మీ చీఫ్ చెప్పారు. కాల్పులు జరపవద్దని ఆయన సైన్యాన్ని, పోలీసులను కోరారు.
దేశంలో శాంతిని తిరిగి తీసుకువస్తాం: ఆర్మీ చీఫ్
దేశంలో శాంతిని నెలకొల్పుతామని చెప్పారు. హింసను ఆపాలని మేము పౌరులను కోరుతున్నామన్నారు. గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలను విచారిస్తామన్నారు. దేశంలో కర్ఫ్యూ లేదా ఎమర్జెన్సీ అవసరం లేదన్నారు. ఈ రాత్రికి సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాం అని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి ఇళ్లకు వెళ్లాలని కోరారు.
ఇప్పటి వరకు 106 మందికి పైగా మరణించారు
అంతకుముందు,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లారు. మరోవైపు ప్రధాని హసీనా అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు ప్రవేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆదివారం నుంచి ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 106మందికి పైగా మరణించారు. వివాదాస్పద రిజర్వేషన్ వ్యవస్థపై హసీనా ప్రభుత్వంపై విస్తృత నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని మీడియా కథనాల ద్వారా నివేదించబడింది. ఈ వివాదాస్పద రిజర్వేషన్ విధానంలో,1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్న వ్యక్తుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించే నిబంధన ఉంది. అంతకుముందు,లాంగ్ మార్చ్ టు ఢాకా'లో పాల్గొనాలని నిరసనకారులు సాధారణ ప్రజలకు పిలుపునిచ్చిన తరువాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది.