LOADING...
Bangladesh: సుప్రీంకోర్టు సంచలనం.. యూనస్‌ సర్కారుకు మరింత అధికారం
సుప్రీంకోర్టు సంచలనం.. యూనస్‌ సర్కారుకు మరింత అధికారం

Bangladesh: సుప్రీంకోర్టు సంచలనం.. యూనస్‌ సర్కారుకు మరింత అధికారం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనల వల్ల మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్‌ ఆధ్వర్యంలో కేర్‌టేకర్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూనస్‌ ప్రభుత్వ అధికార పరిధిని మరింత విస్తరించేలా అక్కడి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. పార్టీలకు అతీతంగా పనిచేసే కేర్‌టేకర్‌ ప్రభుత్వ వ్యవస్థను తిరిగి అమలు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. 2011లో ఎన్నికల సమయంలో నిష్పాక్షికంగా వ్యవహరించే ఈ కేర్‌టేకర్‌ మెకానిజాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టే ముందుగా తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఆ నిర్ణయం చట్టపరంగా సరైనది కాదని అత్యున్నత న్యాయస్థానం విమర్శించింది.

వివరాలు 

 14వ పార్లమెంటు ఎన్నికల నుంచి కేర్‌టేకర్‌ ప్రభుత్వ వ్యవస్థ అమల్లోకి ..

ప్రధాన న్యాయమూర్తి రెఫాత్‌ అహ్మద్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల అప్పిలేట్‌ విభాగం ఈ తీర్పును గురువారం ప్రకటించింది. అసలిది 1996లో ప్రవేశపెట్టిన వ్యవస్థ. ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాకుండా, ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగటమే దీని లక్ష్యం. ఇది గరిష్టంగా 90 రోజులపాటు అధికారంలో ఉంటుంది. తాజా తీర్పు ప్రకారం ప్రస్తుతం యూనస్‌ నేతృత్వంలో కొనసాగుతున్న కేర్‌టేకర్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 13వ పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత సుప్రీం తీర్పు ప్రకారం.. 14వ పార్లమెంటు ఎన్నికల నుంచి కేర్‌టేకర్‌ ప్రభుత్వ వ్యవస్థ అమల్లోకి వస్తోంది.

వివరాలు 

హసీనాను  అప్పగించడంలో భారత్‌ విముఖత

మరోవైపు, మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేర విచారణ ట్రైబ్యునల్‌ (ICT) మరణదండన విధించిన విషయమూ తెలిసిందే. గత సంవత్సరం జరిగిన నిరసనల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేశారని ఆమెతో పాటు ఆమెకు చెందిన పలువురిపై ఐసీటీ ఈ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో హసీనాను బంగ్లాదేశ్‌కు తీసుకురావాలన్న పట్టుదల యూనస్‌ ప్రభుత్వంలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఉన్నప్పటికీ, భారత్‌ ఆమెను అప్పగించడంలో ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలో యూనస్‌ ప్రభుత్వానికి అనుకూలించేలా ఆ దేశ సుప్రీం ఇలాంటి తీర్పునివ్వడం గమనార్హం.