Bangladesh: ఇండియన్ నూలుపై డ్యూటీ-ఫ్రీ తొలగింపుకు బంగ్లా టెక్స్‌టైల్ మిల్లుల డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం చేపట్టిన తర్వాత నుంచి భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య,వాణిజ్య సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఇదే సమయంలో ఆ దేశంలో హిందువులపై దాడులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ వర్గాలు మరో కొత్త డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి అవుతున్న నూలుకు ఉన్న డ్యూటీ-ఫ్రీ సౌకర్యాన్ని రద్దు చేయాలని అక్కడి టెక్స్‌టైల్ మిల్లులు డిమాండ్ చేస్తున్నాయి. ఆ సౌకర్యాన్ని కొనసాగిస్తే ఫిబ్రవరి 1 నుంచి కర్మాగారాలను మూసివేస్తామని బంగ్లా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఈ అంశంపై వాణిజ్య శాఖ నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు లేఖ వెళ్లినట్లు యూనస్ ప్రభుత్వం వెల్లడించింది.
వివరాలు
భారత నూలుకు సుంకం లేని దిగుమతి సౌకర్యాన్ని ఉప సంహరించుకోకపోతే..
జనవరి చివరి వరకు భారత్ నుంచి వచ్చే నూలుపై సుంకం మినహాయింపును ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్పిన్నింగ్ యూనిట్లలో కార్యకలాపాలు నిలిపివేస్తామని దేశీయ మిల్లుల యజమానులు స్పష్టం చేశారు. ఎన్నేళ్లుగా భారత్ నుంచి సుంకం లేకుండా తక్కువ ధరకు నూలు దిగుమతి అవుతుండటంతో స్థానిక స్పిన్నింగ్ యూనిట్లు తీవ్రంగా నష్టపోయాయని వారు లేఖలో పేర్కొన్నారు. దీని ప్రభావంతో దేశీయ వస్త్ర పరిశ్రమలో 12 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన అమ్ముడుపోని నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. అలాగే 50కి పైగా వస్త్ర పరిశ్రమలు మూతపడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
భారత్‌లో ఉత్పత్తి అయ్యే నూలుకే ఎక్కువ ప్రాధాన్యం
ఇదిలా ఉండగా, వస్త్ర పరిశ్రమ మిల్లుల డిమాండ్‌కు బంగ్లాదేశ్ వస్త్ర ఎగుమతిదారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసే నూలుతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే నూలు ధర ఎక్కువగా ఉంటుందని ఎగుమతిదారులు చెబుతున్నారు. అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్లు, నాణ్యత పరంగా ప్రపంచ మార్కెట్లు భారత్‌లో ఉత్పత్తి అయ్యే నూలుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయని వారు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో భారత్‌కు ఉన్న డ్యూటీ-ఫ్రీ సౌకర్యాన్ని తొలగిస్తే బంగ్లాదేశ్ నుంచి వస్త్ర ఎగుమతులు తగ్గిపోతాయని హెచ్చరించారు. అలా జరిగితే ప్రపంచ దుస్తుల మార్కెట్‌లో పోటీని బంగ్లాదేశ్ సమర్థంగా ఎదుర్కోలేదని ఎగుమతిదారుల సంఘం అభిప్రాయపడింది.