Page Loader
Bangladesh: బంగ్లాదేశ్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు.. చర్చలతో పరిష్కరించేందుకు సిద్ధమన్న బంగ్లా
బంగ్లాదేశ్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు.. చర్చలతో పరిష్కరించేందుకు సిద్ధమన్న బంగ్లా

Bangladesh: బంగ్లాదేశ్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు.. చర్చలతో పరిష్కరించేందుకు సిద్ధమన్న బంగ్లా

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ ఈశాన్య ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతవుతున్న సరకులపై ఆ దేశం విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా, భారత్‌ కూడా బంగ్లా దిగుమతులపై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత్‌తో ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

వివరాలు 

వస్త్ర పరిశ్రమలో భారత్‌ ప్రథమ స్థానంలో..

"భారత ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యల గురించి మాకు ఇంకా అధికారిక సమాచారం అందలేదు. ఆ సమాచారం వచ్చిన తర్వాత మేము తగిన చర్యలు చేపడతాం. ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని చర్చల ద్వారానే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. అఖౌరా, డాకీ పోర్టులు సహా కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి భారత్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తల ద్వారా తెలిసింది. ఈ పరిణామం రెండు దేశాల ప్రయోజనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వస్త్ర పరిశ్రమలో భారత్‌ ప్రథమ స్థానంలో ఉందని మేము భావిస్తున్నాం. అయినప్పటికీ, మా దేశం నుంచి ఆ రంగానికి చెందిన ఉత్పత్తులు భారత్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఇది మాకున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది.

వివరాలు 

భారత్‌ నుంచి వచ్చే ఉత్పత్తులపై బంగ్లాదేశ్‌ పరిమితులు

భారత్‌-బంగ్లాదేశ్‌ ఒకే ప్రాంతంలో ఉన్న పొరుగుదేశాలు. అందువల్ల సహజంగానే వాణిజ్యం, రవాణా వంటి రంగాల్లో పోటీ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో మేము పరిమితులు విధించాల్సి వస్తుంది. భారత్‌ కూడా అలాగే చేస్తోంది. ఇది వాణిజ్య ప్రక్రియలో సహజంగా జరిగే అంశమే. ఇందులో ఏవైనా సమస్యలు తలెత్తినా, చర్చల ద్వారానే రెండు దేశాలు పరిష్కరించుకుంటాయి," అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా,గత నెలలో భారత్‌ నుంచి వచ్చే ఉత్పత్తులపై బంగ్లాదేశ్‌ పరిమితులు విధించింది. దానికి ప్రతిగా భారత్‌ కూడా బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఆంక్షలు విధించింది. ఆ జాబితాలో రెడీమేడ్‌ దుస్తులు,శుద్ధి చేసిన ఆహార పదార్థాలు,కార్బొనేటెడ్‌ పానీయాలు,పత్తి,నూలు వ్యర్థాలు,ప్లాస్టిక్‌,పీవీసీ ఉత్పత్తులు,కలపతో తయారైన ఫర్నీచర్‌ వంటి సరకులు ఉన్నాయి.

వివరాలు 

ఎల్పీజీ గ్యాస్‌, వనస్పతి నూనె, కంకర పై పరిమితులు వర్తించవు 

ఈ వస్తువులు దేశంలోకి ప్రవేశించేందుకు కోల్‌కతా నౌకాశ్రయం లేదా ముంబయిలోని జవహర్‌లాల్ నెహ్రూ నౌకాశ్రయం నుంచే అనుమతి ఇచ్చే విధంగా నిర్ణయించారు. అయితే, బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతయ్యే చేపలు, ఎల్పీజీ గ్యాస్‌, వనస్పతి నూనె, కంకర వంటి వస్తువులపై ఈ పరిమితులు వర్తించవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.