
Donald Trump: 'బరాక్ ఒబామా ఏమీ చేయకుండానే ఇచ్చారు'.. నోబెల్‌పై ట్రంప్ ఆవేదన!
ఈ వార్తాకథనం ఏంటి
నోబెల్ శాంతి బహుమతి విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ఆశలు పెట్టుకున్నారు. నేడు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు సంబంధించిన ప్రకటన రానుండటంతో, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ అవార్డు ఇచ్చిన తీర్మానం పై అయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏమీ చేయకపోయినా ఒబామాకు అవార్డు ఇచ్చారని, తనకు ఎనిమిది యుద్ధాలను ఆపిన ఘనత ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వలేదో తెలియదని ట్రంప్ అన్నారు. గురువారం వైట్‌హౌస్‌లో జరగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, గాజాలో శాంతిని స్థాపించడం సహా తన పదవీకాలంలో ఎనిమిది యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానంటూ ఉద్ఘాటించారు.
వివరాలు
ఒబామా ఏమీ చేయకపోయినా అవార్డు: ట్రంప్
అయినా, తనకు ఈ అవార్డు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఒబామా యధార్థంగా ఏమీ సాధించలేదని, పైగా అమెరికాను నాశనం చేశారని విమర్శలు చేశారు. "ఒబామా ఏమీ చేయకపోయినా అవార్డు పొందాడు. ఎందుకు ఇచ్చారో అతనికే తెలియదు. అతను అమెరికాకు నష్టాన్ని కలిగించాడనే కారణంతో ఆ బహుమతిని ఇచ్చారని నేను భావిస్తున్నాను. కానీ, నేను నా పదవీకాలంలో ఎనిమిది యుద్ధాలను ఆపాను.ఇంతకుముందు ఎప్పుడూ ఇది జరగలేదు ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయని ఘనత. అయినప్పటికీ, అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చేశాను' అని ట్రంప్ అన్నారు.
వివరాలు
2009లో బరాక్ ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి
2009లో బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అయితే, ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత, ఈ బహుమతిని గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలతో పాటు అనేక ఘర్షణలు ఆపానంటూ స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు. దీనిలో భాగంగా, పాక్ సైన్యాధిపతి మునీర్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ తదితరులు ట్రంప్ పేరు నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్‌కు పంపించారు. నేడు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటన చేయబడనుండటంతో, ఈ క్రమంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.