Barack Obama: 'ట్రంప్ వల్లే మా సంసార జీవితంలో ఇబ్బందులు' : బరాక్ ఒబామా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama)కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయా అన్న ప్రశ్నకు ఆయనే సమాధానం ఇచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పాలన కొనసాగుతున్న సమయంలో రాజకీయాల్లో చురుకుగా ఉండాలని డెమోక్రటిక్ పార్టీ ఒబామాపై ఒత్తిడి తీసుకువస్తోంది. మరోవైపు ఆయన భార్య మిచెల్ ఒబామా(Michelle Obama)మాత్రం ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రెండు వైపుల ఒత్తిడుల మధ్య ఒబామా చిక్కుకున్నారు. తన జీవితంలో మిగిలిన కాలాన్ని కుటుంబంతో గడపాలని భార్య కోరుకుంటోందని ఆయన తెలిపారు. ఈ విషయమే తమ దాంపత్య జీవితంలో కొంత ఉద్రిక్తతకు కారణమవుతోందని ఒబామా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వివరాలు
ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఒబామా విమర్శలు
తనపై ఉన్న రాజకీయ బాధ్యతలు ఒకవైపు,కుటుంబ బాధ్యతలు మరోవైపు ఉండటంతో సమతుల్యత సాధించడం కష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. తనకు మరింత సమయం కేటాయించాలని భార్య ఆశిస్తున్నారని,ఈపరిస్థితి ఆమెకు నిరాశ కలిగిస్తోందని వివరించారు. సాధారణంగా అమెరికా మాజీ అధ్యక్షులు అధికారాన్ని వదిలిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఒబామా కూడా అలానే మౌనం పాటించారు.ఆయన విధానాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉన్నారు. అయితే కాలక్రమేణా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ఒబామా విమర్శలు చేయడం ప్రారంభించారు. అధ్యక్ష పదవిని వదిలి చాలాకాలం గడిచినా,ఇంకా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న అరుదైన నేతల్లో ఒబామా ఒకరిగా నిలిచారు. డెమోక్రటిక్ పార్టీ కోసం నిరంతరం పని చేస్తూ తన రాజకీయ ప్రభావాన్ని కొనసాగిస్తున్నారు.