Page Loader
Bat Virus: గబ్బిలాల నుంచి మానవులకు సోకే కొత్త వైరస్ గుర్తింపు
Bat Virus: గబ్బిలాల నుంచి మానవులకు సోకే కొత్త వైరస్ గుర్తింపు

Bat Virus: గబ్బిలాల నుంచి మానవులకు సోకే కొత్త వైరస్ గుర్తింపు

వ్రాసిన వారు Stalin
Jan 14, 2024
06:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

గబ్బిలాల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉన్న మరో నూతన వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త వైరస్‌ను థాయ్‌లాండ్‌లో గుర్తించినట్లు 'ఎకోహెల్త్‌ అలయన్స్‌' అనే పరిశోధన చేసే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తుంది. ఈ కొత్త వైరస్‌ను ఇది వరకు ఎప్పుడూ చూడలేదని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)' సమావేశంలో పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ దస్జాక్ పేర్కన్నారు. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో ఎకోహెల్త్‌పై గతంలో చేసిన పరిశోధనల వల్లే కరోనా వైరస్ బయటకు లీకైందన్న వాదనలను 'ఎకోహెల్త్‌ అలయన్స్‌' సంస్థ కొట్టిపారేయడం గమనార్హం.

వైరస్

కరోనా స్థాయిలో కొత్త వైరస్‌ వ్యాప్తి

కొత్త వైరస్‌పై శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ దస్జాక్ సంచలన విషయాలను వెల్లడించారు. కొత్త వైరస్‌కు కరోనా స్థాయిలో వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్లు పీటర్‌ వెల్లడించారు. ఈ నూతన వైరస్‌ను థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో ఉన్న గబ్బిలాల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే రైతులు.. ఈ గుహలోని గబ్బిలాల ఎరువును తమ పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. రైతులు సేకరిస్తున్న ఎరువులోనే వైరస్‌ ఉన్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఈ వైరస్‌ భవిష్యత్‌లో అత్యవసర పరిస్థితులను తీసుకురావడానికి అవకాశం ఉందన్నారు.