Mehul Choksi: మెహుల్ ఛోక్సీ అప్పగింతకు బెల్జియం గ్రీన్ సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త,ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) భారత్‌కు అప్పగింత విషయంలో బెల్జియం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనను భారత్‌కు అప్పగించడంలో ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. ఇటీవల బెల్జియం న్యాయస్థానం ఛోక్సీని భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నదని, అది తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదని మెహుల్ ఛోక్సీ ఆరోపించారు. ఈ వాదనలపై తాజాగా బెల్జియం యాంట్వెర్ప్ న్యాయస్థానం స్పష్టతనిచ్చింది. ఛోక్సీ బెల్జియం పౌరుడు కాదని గుర్తు చేసింది.అతడు భారత్‌లో ఎదుర్కొంటున్న కేసులు తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించినవని తెలిపింది.
వివరాలు
లండన్‌లో నీరవ్ మోదీ
భారతప్రభుత్వం చేసిన అభియోగాలు బెల్జియం చట్టప్రకారం కూడా నేరాలుగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది. భారత్ ఆదేశాల మేరకు తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారంటూ చాలాకాలంగా ఛోక్సీ చేస్తున్న వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది.అదనంగా,ఛోక్సీ భారత్‌కు అప్పగించబడిన తర్వాత అతడిని ఉంచే జైలుకు సంబంధించిన వివరాలను భారత ప్రభుత్వం అందించిందని కోర్టు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి దాదాపు ₹13,000కోట్ల రుణాన్ని ఎగవేసిన మెహుల్ ఛోక్సీ,అతని మేనల్లుడు నీరవ్ మోదీ(కేసులో మరో ప్రధాన నిందితుడు)ఇద్దరూ దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాలో ఆశ్రయం పొందగా,నీరవ్ మోదీ లండన్‌లో తలదాచుకున్నాడు. తాజాగా బెల్జియం యాంట్వెర్ప్ కోర్టు ఛోక్సీని భారత్‌కు అప్పగించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది.