Page Loader
Bezos and Sanchez wedding: 90 జెట్‌లు, 250 మంది అతిథులతో €48 మిలియన్లతో వెనిస్‌ నగరంలో భారీ ఏర్పాట్లు
90 జెట్‌లు, 250 మంది అతిథులతో €48 మిలియన్లతో వెనిస్‌ నగరంలో భారీ ఏర్పాట్లు

Bezos and Sanchez wedding: 90 జెట్‌లు, 250 మంది అతిథులతో €48 మిలియన్లతో వెనిస్‌ నగరంలో భారీ ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెజాన్ అధినేత, ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్ తన ప్రేమికురాలు లారెన్ సాంచెజ్‌ను రెండవసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వివాహ వేడుక ఇటలీలోని అద్భుతమైన నగరం వెనిస్‌లో జరుగనుంది. ఈ వేడుకను కొన్ని మీడియా వర్గాలు 'శతాబ్దపు అత్యంత గ్రాండ్ వివాహం'గా అభివర్ణిస్తున్నాయి. కానీ, ఈ వేడుక అలంకారాలు, గ్లామర్ వెనుక నిరసనల శబ్దాలు గట్టిగా వినిపిస్తున్నాయి. 'నో స్పేస్ ఫర్ బెజోస్' అనే నినాదాలతో స్థానికులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆగ్రహాన్ని చాటుతున్నారు.

వివరాలు 

61 ఏళ్ల వరుడు, 55 ఏళ్ల వధువు 

జెఫ్ బెజోస్ (61),లారెన్ సాంచెజ్ (55) తమ వివాహ వేడుకను జూన్ 24 నుండి 28, 2025 మధ్య వెనిస్ నగరంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకను అత్యంత వైభవంగా జరిపేందుకు ఎలాంటి రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాపార, రాజకీయ, హాలీవుడ్, ఆర్థిక రంగాల్లోని ప్రముఖులైన 200-250 మంది అతిథులను ఆహ్వానించారు. కానీ వెనిస్ నివాసితులు ఈ ఘనమైన వేడుకపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ నగరాన్ని సంపన్నుల ప్రైవేట్ ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని వారు మండిపడుతున్నారు.

వివరాలు 

ప్రారంభ వేదికలో మార్పు - కారణమేంటి? 

ప్రారంభంలో బెజోస్ తన వివాహానికి వెనిస్‌లోని స్కూలా గ్రాండే డెల్లా మిసెరికార్డియా అనే చారిత్రక మత పాఠశాలను ఎంపిక చేశాడు. కానీ ఇది స్థానికుల ఆగ్రహానికి గురైంది. 'నో స్పేస్ ఫర్ బెజోస్' ఉద్యమం కింద, నిరసనకారులు వీధులు, కాలువలు, వంతెనలు అన్నీ ఆక్రమించి నిరసనలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, వివాహ స్థలాన్ని మార్చాల్సి వచ్చింది. ఇప్పడు ఈ వివాహం వెనిస్‌లోని 'ఆర్సెనల్' ప్రాంతంలో జరగనుంది. ఇది నీటిమీద మాత్రమే రాకపోకలు సాగించగలిగే ప్రదేశం కావడం వల్ల, నిరసనకారులు అక్కడకి చేరలేకపోవడం వల్ల ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. రాయిటర్స్ ప్రకారం, భద్రత, గోప్యత దృష్ట్యా ఈ ప్రదేశం ఎంపికైంది.

వివరాలు 

అసలు ఖర్చు ఎంతంటే..! 

ఈ పెళ్లి వేడుకకు ఖర్చవుతున్న మొత్తం షాకింగ్‌గా ఉంది. మొత్తం 48 మిలియన్ యూరోలు అంటే సుమారుగా 55.7 మిలియన్ అమెరికన్ డాలర్లు - అంటే సుమారు రూ. 400 కోట్లు ఖర్చవుతోంది. వివిధ దేశాల నుంచి అతిథులను తీసుకురావడానికి 90 ప్రైవేట్ జెట్‌లు వెనిస్, ట్రెవిసో, వెరోనా ఎయిర్‌పోర్ట్లకు రావాల్సి ఉంటుంది. అలాగే, ఆర్సెనల్‌కు వారికి రవాణా కోసం 30 వాటర్ టాక్సీలు బుక్ చేశారు.

వివరాలు 

విలాసవంతమైన హోటళ్లలో అతిథుల బస 

వెనిస్‌లో ఉన్న అత్యంత ఖరీదైన హోటళ్లను ముందుగానే బుక్ చేశారు. అమన్ వెనిస్,గ్రిట్టి ప్యాలెస్,సెయింట్ రెగిస్,బెల్మండ్ సిప్రియాని,హోటల్ డానియలీ వంటి హోటళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా అతిథుల కోసం రిజర్వ్ చేశారు. వారికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతీ చిన్న విషయానికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. లెహంగా ఖరీదు రూ. 12 కోట్లు! లారెన్ సాంచెజ్ ధరించబోయే పెళ్లి లెహంగా కూడా భారీగా చర్చకు దారితీసింది. దానికి ఖర్చవుతున్నమొత్తం దాదాపుగా $1.5మిలియన్ (రూ.12కోట్లకు పైగా). ఈ లెహంగా పెళ్లి వేడుకలో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అంతేకాదు,బెజోస్ లారెన్‌కు నిశ్చితార్థ సమయంలో ఇచ్చిన పింక్ డైమండ్ రింగ్ విలువ $3 మిలియన్ నుండి $5 మిలియన్ మధ్య ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

అతిథుల జాబితాలో అగ్రస్థానంలోని ప్రముఖులు 

ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల జాబితాలో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, లియోనార్డో డికాప్రియో, కిమ్ కర్దాషియన్, కేటీ పెర్రీ, డయాన్ వాన్ ఫర్‌స్టెన్‌బర్గ్, ఎలోన్ మస్క్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరు ఈ వారం చివరలో వెనిస్ చేరుకొని శనివారం జరిగే మెగా పార్టీకి హాజరుకానున్నారు. ఈ అతిథుల్లో చాలామంది 2023లో బెజోస్-లారెన్ నిశ్చితార్థ వేడుకకు కూడా హాజరైన వారే. ఆ వేడుకను ఇటలీలోని పోసిటానో వద్ద అమాల్ఫీ తీరంలో నిర్వహించారు.

వివరాలు 

మొదటి పెళ్లి - విడాకులు - కొత్త జీవితం 

జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్‌ను 1993లో వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లి 25 సంవత్సరాల పాటు కొనసాగింది. 2019లో వారు విడిపోయారు. ఆ సమయంలో తన సంపదలో సగభాగాన్ని బెజోస్ ఆమెకు ఇచ్చాడు, ఫలితంగా మెకెంజీ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక మహిళల్లో ఒకరుగా నిలిచారు. బెజోస్,లారెన్ మధ్య సంబంధం 2018లో పబ్లిక్ అయింది. 2023లో ఫ్రాన్స్ తీరంలో ఉన్న తన ప్రైవేట్ యాచ్ మీద లారెన్‌కు ప్రపోజ్ చేశాడు. ఈ జంట తమ నిశ్చితార్థ వేడుకలను అమాల్ఫీ కోస్ట్ మరియు అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లో జరిపారు.