Biden: అమెరికా-చైనా పోటీలో భారత్ కీలకం.. బైడెన్ పుస్తకంలో ఆసక్తికర అంశాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల విడుదల చేసిన తన జ్ఞాపకాల పుస్తకం *Promise Me, America*లో భారత్ ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా అనుసరించాల్సిన వ్యూహంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని బలంగా సమర్థించారు. భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC) వంటి కీలక ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని కూడా వివరించారు. 2006లో భారత్-అమెరికా పౌర అణు ఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదం లభించేలా తాను చేసిన ప్రయత్నాలను బైడెన్ గుర్తుచేసుకున్నారు. ఆ ఒప్పందం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
భారత్‌తో మరింత బలమైన సంబంధాలు అవసరం
భారత్‌తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బైడెన్ పేర్కొన్నారు.
పాకిస్థాన్‌తో కూడా అమెరికాకు సంబంధాలు ఉన్నప్పటికీ.. భారత్‌తో బలమైన బంధం కొనసాగించడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని వివరించారు.
1965లో అమెరికా తీసుకొచ్చిన వలస చట్టం వల్ల భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వలస వెళ్లేందుకు అవకాశం ఏర్పడిందని, దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని గుర్తుచేశారు.
చైనా ఎదుగుదల నేపథ్యంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడేందుకు కొత్త 'పసిఫిక్ కమ్యూనిటీ' ఏర్పాటు చేయాలన్న తన ఆలోచనలోనూ భారత్‌కు చోటు కల్పించారు.
వివరాలు
చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేసే ఆర్థిక కూటమి
చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ఆర్థిక కూటమి అవసరమని బైడెన్ అభిప్రాయపడ్డారు.
అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, కెనడా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, న్యూజిలాండ్ దేశాలన్నీ కలిస్తే వాటి మొత్తం ఆర్థిక వ్యవస్థ విలువ 60 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు.
అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 19 లక్షల కోట్ల డాలర్లుగా ఉందని వివరించారు.
ఈ దేశాల ఆర్థిక బలాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
సైనిక రంగంలో పరస్పర సహకారం, సమన్వయం పెంచుకోవడంతో పాటు ఉమ్మడి విలువలకు ప్రాధాన్యమివ్వాలని బైడెన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
వివరాలు
అద్భుతమైన ఆలోచనగా భారత్-యూరప్ ఆర్థిక కారిడార్
భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC) ప్రాధాన్యాన్ని కూడా బైడెన్ వివరించారు.
2023 సెప్టెంబరులో న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
ముంబయి నుంచి అరేబియా ద్వీపకల్పం మీదుగా ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్టు, అక్కడి నుంచి దక్షిణ ఐరోపా వరకు వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఇది సులభమైనదే అయినప్పటికీ అద్భుతమైన ఆలోచన అని బైడెన్ అభివర్ణించారు.
అయితే పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల కారణంగా ఈ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని ఆయన అంగీకరించారు.