Page Loader
Joe Biden: 96శాతం ఓట్లతో 'సౌత్ కరోలినా' ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం
Joe Biden: 96శాతం ఓట్లతో 'సౌత్ కరోలినా' ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం

Joe Biden: 96శాతం ఓట్లతో 'సౌత్ కరోలినా' ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం

వ్రాసిన వారు Stalin
Feb 04, 2024
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు. అతను మిన్నెసోటా ప్రతినిధి డీన్ ఫిలిప్స్, రచయిత్రి మరియాన్నే విలియమ్సన్‌లను భారీ తేడాతో ఓడించారు. బైడెన్‌కు మొత్తం 96శాతం ఓట్లు పోలవడం గమనార్హం. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా అంతర్గతంగా ఈ ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తారు. దక్షిణ కరోలినా జనాభాలో 26 శాతం మంది నల్లజాతీయులు ఉంటారు. ఈ ప్రాంతంలోని మెజార్టీ నల్లజాతీయులు బైడెన్‌కు మద్దతు ఇస్తున్నారు. 2020లో బైడెన్‌ను అధ్యక్షుడిగా చేయడంలో ఇక్కడి ఓటర్లు కీలక పాత్ర పోషించారు.

అమెరికా

బైడెన్‌కు పెరిగిన నల్లజాతీయుల మద్దతు

ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్న నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అంతర్గత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో 10మంది నల్లజాతి ఓటర్లలో 9 మంది బిడెన్‌కు ఓటు వేశారు. 2020తో పోలిస్తే దక్షిణ కరోలినాలో బైడెన్‌కు ఓటు వేసిన నల్లజాతి ఓటర్ల సంఖ్య 13 శాతం పెరిగింది. అంతకుముందు, న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో కూడా బిడెన్ విజయం సాధించారు. బైడెన్ స్వయంగా ఈ ఎన్నికల్లో నిలబడకపోయినా.. పార్టీ నాయకులు ఆయన్నే ఎన్నుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 24న రిపబ్లికన్ పార్టీ కూడా సౌత్ కరోలినాలో ప్రాథమిక ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇందులో ట్రంప్, నిక్కీ హేలీ ముఖాముఖి తలపడనున్నారు.