Pakistan Balochistan attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 80 మందిపైగా భద్రతా సిబ్బంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన భారీ దాడుల్లో 80 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం, పోలీస్, గూఢచారి సంస్థలు, కౌంటర్ టెర్రరిజం యూనిట్లకు చెందిన సిబ్బంది మృతి చెందినట్లు BLA ప్రకటించింది. ఈ దాడులను 'ఆపరేషన్ హీరోఫ్ - ఫేజ్ 2'గా పేర్కొంటూ BLA అధికారిక ప్రకటనను విడుదల చేసింది. BLA ప్రకటన ప్రకారం దాదాపు పది గంటల పాటు కొనసాగిన ఈ దాడులు బలూచిస్తాన్‌లోని పలు జిల్లాల్లో ఒకేసారి జరిగాయి. భద్రతా దళాలు, సైనిక స్థావరాలు, పరిపాలనా కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపింది. ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Details
18 మంది బంధీలుగా
విడుదల చేసిన ప్రకటనలో క్వెట్టా, నోష్కీ, మస్తుంగ్, దల్బందిన్, కలాత్, ఖరాన్, పంజ్గూర్, గ్వాదర్, పస్ని, తుర్బత్, తుంప్, బులెడా, మాంగోచర్, లస్బేలా, కెచ్, అవరాన్ తదితర ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు జరిగినట్లు BLA పేర్కొంది. శత్రు సైనిక, పరిపాలనా, భద్రతా వ్యవస్థలపై దాడులు చేసి పలు ప్రాంతాల్లో భద్రతా దళాల కదలికలను తాత్కాలికంగా నిలిపివేశామని వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 84 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారని, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని, మరో 18 మందిని బంధీలుగా పట్టుకున్నామని BLA తెలిపింది. అలాగే ప్రభుత్వానికి చెందిన 30కిపైగా కార్యాలయాలు, బ్యాంకులు, జైళ్లను ధ్వంసం చేశామని, 20కుపైగా వాహనాలకు నిప్పంటించామని పేర్కొంది.
Details
భద్రతా స్థావరాలపై తాత్కాలికంగా నియంత్రణ
కొన్ని భద్రతా స్థావరాలపై తాత్కాలికంగా నియంత్రణ సాధించినట్లు కూడా BLA వాదించింది. ఇదే సమయంలో ఈ దాడుల్లో తమవైపు ఏడుగురు యోధులు మృతి చెందినట్లు BLA అంగీకరించింది. వీరిలో "ఎలైట్ మజీద్ బ్రిగేడ్" సభ్యులు కూడా ఉన్నారని తెలిపింది. భద్రతా స్థావరాలపై నిర్వహించిన సమన్వయ దాడుల సమయంలో వారు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక వేర్పాటువాద మిలిటెంట్ సంస్థలలో ఒకటి. రాజకీయ స్వయంప్రతిపత్తి, సహజ వనరులపై నియంత్రణ, అభివృద్ధిలో నిర్లక్ష్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా తిరుగుబాటు కొనసాగుతోంది. ముఖ్యంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)కు సంబంధించిన ప్రాజెక్టులు, విదేశీ ప్రయోజనాలపై BLA గతంలోనూ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.