LOADING...
Bangladesh-China: చైనా-బంగ్లాదేశ్ డిఫెన్స్ ఒప్పందం.. భారత్‌కు స్ట్రాటజిక్ సవాల్? 
చైనా-బంగ్లాదేశ్ డిఫెన్స్ ఒప్పందం.. భారత్‌కు స్ట్రాటజిక్ సవాల్?

Bangladesh-China: చైనా-బంగ్లాదేశ్ డిఫెన్స్ ఒప్పందం.. భారత్‌కు స్ట్రాటజిక్ సవాల్? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అనేక దేశాలు ఆధునిక ఆయుధాలు, నిఘా సాంకేతికతలు,అంతర్జాతీయ సైనిక కూటమీలలో భారీ పెట్టుబడులను ప్రారంభించాయి. ఈ ధోరణి దక్షిణాసియాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.ఈ మార్పుల ప్రభావానికి బంగ్లాదేశ్ కూడా మినహాయింపు కాదు. దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారాన్ని పెంపొందించడం కోసం బంగ్లాదేశ్ పలు కీలక చర్యలను చేపడుతోంది. ఇలాంటి నేపథ్యంలో చైనా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన తాజా రక్షణ ఒప్పందం భారత్ భద్రతా ప్రయోజనాలపై ఏ ప్రభావం చూపుతుందో అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళం చైనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ (CETC)తో ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

వివరాలు 

ఈ ఒప్పందం ప్రభుత్వాల మధ్య (G2G) ఫ్రేమ్‌వర్క్‌లో అమలు

ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌లో డ్రోన్లు (UAVలు) తయారీ, అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటు, అలాగే సంబంధిత సాంకేతికత బంగ్లాదేశ్‌కు బదిలీ చేయనుంది. ఈ ఒప్పందం ప్రభుత్వాల మధ్య (G2G) ఫ్రేమ్‌వర్క్‌లో అమలు కానుంది. కొంతమంది భారత రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్నిబట్టి, బంగ్లాదేశ్‌లో చైనా డ్రోన్ల కంపెనీ స్థాపన భారత్ భద్రతకు సవాళ్లను సృష్టించవచ్చని సూచిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌కు రాజకీయంగా బలమైన సంకేతాన్ని ఇవ్వడానికి ఈ ఒప్పందాన్ని కుదుర్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశం మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వంపై మరింత చర్చలకు దారితీస్తోంది.

వివరాలు 

ఢాకాలోని వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో సంతకాలు

బంగ్లాదేశ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, గత వారం బంగ్లాదేశ్ వైమానిక దళం (BAF)-CETC ఇంటర్నేషనల్ మధ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. రాజధాని ఢాకాలోని వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో సంతకాలు పూర్తయినట్లు కూడా పేర్కొన్నారు. నిపుణుల విశ్లేషణల ప్రకారం, ఈ పరిణామాలు దక్షిణాసియా భద్రతా సమీకరణలో కొత్త మార్పులకు దారితీయవచ్చు. భారత్‌ దృష్టిలో ఈ ఒప్పందం వ్యూహాత్మక సవాలుగా ఎంతవరకు మారుతుందో రాబోయే రోజుల్లో మరింత స్పష్టమవుతుంది.

Advertisement