Pakistan election: నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. దురదృష్టవశాత్తు ఏ పార్టీకి ఎవరికీ మెజారిటీ రాకపోవంతో హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతుండగా.. మరోవైపు నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వం కోసం పావులు కదుపుతున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షరీఫ్‌తో సమావేశమయ్యారు. రాజకీయ అస్థిరత నుంచి పాకిస్థాన్‌ను కాపాడేందుకు 'సేవ్ పాక్' నినాదంతో ముందుకెళ్లాలని రెండు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.
స్వతంత్ర అభ్యర్థులను ప్రలోభ పెడుతున్న సైన్యం
ఇమ్రాన్ మద్దతు ఇచ్చిన వారు 93సీట్లలో విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ 74సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. బిలావల్ భుట్టో జర్దారీ పార్టీ పీపీపీ 54 స్థానాల్లో విజయం సాధించి మూడో స్థానంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు కావాలి. కానీ నవాజ్ షరీఫ్ పార్టీ, జర్దారీ పార్టీ రెండు కలిసినా కూడా 128 సీట్లు మాత్రమే అవుతున్నాయి. ఈ క్రమంలో మిగత మద్దతుదారుల కోసం ఈ రెండు పార్టీలు అన్వేషిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు నవాజ్ షరీఫ్‌తో కలవడానికి సిద్ధంగా లేరు. దీంతో సైన్యం రంగంలోకి షరీఫ్‌కు మద్దతు ఇవ్వాలని స్వతంత్ర అభ్యర్థులను ప్రలోభపెడుతున్నట్లు తెలుస్తోంది.