LOADING...
Bilawal Bhutto: సింధు జలాల ఒప్పందంపై పాక్ హెచ్చరిక.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని భారత్‌కు సూచన
సింధు జలాల ఒప్పందంపై పాక్ హెచ్చరిక.. భారత్‌కు కీలక సందేశం

Bilawal Bhutto: సింధు జలాల ఒప్పందంపై పాక్ హెచ్చరిక.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని భారత్‌కు సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పాకిస్థాన్ భారత్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఒప్పందం దక్షిణాసియా ప్రాంతంలో శాంతి,స్థిరత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని, దీనిని ఉల్లంఘించే చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్,పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం సక్రమంగా అమలుకాకపోతే అంతర్జాతీయ ఒప్పందాలు,వ్యవస్థల విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదని, నీటి వనరులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం తగదని ఇషాక్ దార్ స్పష్టం చేశారు.

వివరాలు 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమన్న భారత్ 

సింధు నది పాకిస్థాన్ ప్రజలకు జీవనాధారమని పేర్కొన్న బిలావల్ భుట్టో జర్దారీ, తమ దేశానికి కేటాయించిన నీటి హక్కులకు భంగం కలిగితే దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందని హెచ్చరించారు. నదీ జలాలను రాజకీయ లేదా వ్యూహాత్మక ఆయుధాలుగా ఉపయోగించకుండా నిరోధించేందుకు కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన ప్రతిపాదించారు. ఇదిలా ఉండగా, 2025 ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని భారత్ ఆరోపించగా, ఆ ఆరోపణలను పాకిస్థాన్ పూర్తిగా ఖండించింది.

వివరాలు 

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం

అయితే, సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టే వరకు సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే అవకాశం లేదని భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తోంది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం కుదిరింది. అనంతరం ఇరు దేశాల మధ్య పలు యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందం కొనసాగుతూ వచ్చింది. ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ నదుల జలాల వినియోగ హక్కులు భారత్‌కు, సింధు, జీలం, చీనాబ్ నదుల జలాల హక్కులు పాకిస్థాన్‌కు కేటాయించారు.

Advertisement