Iran: చమురు కేంద్రాలపై దాడుల అనంతరం ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఆరోగ్య సమస్యలపై ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే అక్కడి పలు ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ వర్షం సాధారణం కాదని, నల్లటి ఆమ్ల వర్షంగా ఉండొచ్చని మరికొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వర్షం కురిసిన తర్వాత స్థానికుల్లో ఆందోళన నెలకొంది. తలనొప్పి, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అలాగే భవనాలు, వాహనాలపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైమానిక దాడుల తర్వాత కురిసే ఈ తరహా ఆమ్ల వర్షం చాలా ప్రమాదకరమని ఇరాన్‌కు చెందిన రెడ్ క్రిసెంట్ సొసైటీ హెచ్చరించింది.
వివరాలు
శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం
ఇది సాధారణంగా కనిపించే ఆమ్లవర్షంతో పోలిస్తే మరింత హానికరమని, వాతావరణ కాలుష్యంపై పరిశోధనలు చేస్తున్న ఆ సంస్థ తెలిపింది. ఈ వర్షంలో వివిధ రకాల ఆమ్లాలే కాకుండా మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమైన ఇతర కాలుష్య పదార్థాలు కూడా ఉండే అవకాశముందని సంస్థ పరిశోధకులు వివరించారు. సాధారణంగా వర్షం కురిసే సమయంలో గాలిలో ఉన్న కాలుష్యాలను వర్షపు చుక్కలు గ్రహించి భూమిపై పడతాయి. గాలిలో కాలుష్యం అధికంగా ఉన్నప్పుడు ఆ కాలుష్యాలు వర్షంతో కలిసి భూమిపైకి చేరుతాయని తెలిపారు. ఇలాంటి వర్షాల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా హృద్రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని పరిశోధకులు స్పష్టం చేశారు.