Russia: రష్యా మెడికల్ కాలేజీలో రక్తపాతం.. నలుగురు భారతీయ విద్యార్థులపై కత్తిపోట్ల దాడి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలోని బాష్‌కోర్టోస్థాన్ రిపబ్లిక్‌లో శనివారం భయానక హింసాకాండ చోటుచేసుకుంది. ఉఫా నగరంలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లోకి ఓ టీనేజర్ చొరబడి విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో నలుగురు భారతీయ విద్యార్థులు సహా మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి వెనుక నియో-నాజీ భావజాలం ఉందని ప్రాథమిక విచారణలో వెల్లడవడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను రష్యాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరిస్తూ గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.
Details
రక్తసిక్తమైన వసతి గృహం
శనివారం ఉదయం 15 ఏళ్ల వయసున్న బాలుడు కత్తితో మెడికల్ యూనివర్సిటీ వసతి గృహంలోకి ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అతి దారుణంగా దాడులు ప్రారంభించాడు. ఎదురైన వారందరినీ పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులు కత్తిపోట్లకు గురయ్యారు. దాడి సమయంలో హాస్టల్ అంతా రక్తసిక్తంగా మారింది. నిందితుడు బాధితుల రక్తంతో గోడలపై 'స్వస్తిక్' గుర్తులు గీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతేకాకుండా యూదుల మారణహోమాన్ని ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్లు వారు పేర్కొన్నారు.
Details
పోలీసులపైనా దాడి.. నిందితుడికి గాయాలు
దాడి జరుగుతుండగానే కొందరు విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, తప్పించుకునే ప్రయత్నంలో అతడు పోలీసులపైనా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగోలా అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గాయపడిన విద్యార్థులు, పోలీసులు, నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నిషేధిత 'NS/WP' అనే నియో-నాజీ సంస్థకు చెందినవాడని రష్యాలోని ప్రముఖ టెలిగ్రామ్ ఛానల్ 'బాజా' వెల్లడించింది.
Details
భారత రాయబార కార్యాలయం స్పందన
ఈ విషాదకర ఘటనపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కజాన్‌లోని భారత కాన్సులేట్ నుంచి ఉన్నతాధికారులు ఉఫాకు బయలుదేరినట్లు తెలిపింది. "మేం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాయబార కార్యాలయం ప్రకటించింది. రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.