Nigeria Boat Accident: అంత్యక్రియలకు వెళ్తుండగా పడవ బోల్తా.. 24 మంది జలసమాధి!
ఈ వార్తాకథనం ఏంటి
నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఈ దుర్ఘటన శుక్రవారం బాయెల్సా రాష్ట్రంలో జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పడవలో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందనే వివరాలు అధికారులు వెల్లడించలేదు.
వివరాలు
అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం
నైజీరియా జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ప్రతినిధి మాంజో ఎజెకీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయాణికులను పడవలో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పడవ బోల్తా పడటంతో పలువురు నీటిలో మునిగిపోయారు.
సహాయక చర్యల్లో భాగంగా 24 మందిని రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
సాంకేతిక సమస్యే కారణమా?
ప్రమాదంపై ప్రాథమిక విచారణలో పడవలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు వెల్లడైందని పోలీసు ప్రతినిధి మూసా మహమ్మద్ తెలిపారు.
అయితే ప్రమాదానికి ముందు పడవలో సమస్య గుర్తించిన ప్రయాణికులు దానిని ఒడ్డుకు మళ్లించాలని నడిపేవారిని కోరినట్లు బాధితులు ఆరోపించారు.
అయినప్పటికీ పడవ నడిపే వ్యక్తి వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయినట్లు బాధితులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి పడవ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.