USA- Iran: 21 గంటల చర్చలకు బ్రేక్.. ఒప్పందం లేకుండానే వెనక్కి అమెరికా ప్రతినిధులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ (USA-Iran peace talks) శాంతి చర్చలు విఫలమయ్యాయి. దాదాపు 21 గంటల పాటు కొనసాగిన ఈ కీలక చర్చలను మధ్యలోనే ముగించుకుని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ నేతృత్వంలోని బృందం వెనుదిరిగింది. చర్చల అనంతరం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జేడీ వాన్స్ ఈ సంభాషణల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు. అనేక కీలక అంశాలపై దీర్ఘంగా చర్చించినప్పటికీ, తుది ఒప్పందానికి చేరుకోలేకపోయామని తెలిపారు. అమెరికా తరఫున కొన్ని షరతులు పెట్టామని, అయితే వాటిని ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని ఆయన వెల్లడించారు.
వివరాలు
మరింత సమయం ఇచ్చాం
సానుకూల దృక్పథంతో చర్చలకు హాజరైనప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదన్న స్పష్టమైన హామీ ఇవ్వాలని అమెరికా కోరుతోందని వాన్స్ తెలిపారు. అ యితే ఆ డిమాండ్‌ను ఇరాన్ తిరస్కరించినట్లు ఆయన చెప్పారు. ఒప్పందం కుదరకపోయినప్పటికీ, తమ ప్రతిపాదనపై ఆలోచించేందుకు ఇరాన్‌కు మరింత సమయం ఇవ్వనున్నట్లు కూడా ఆయన సూచించారు. ఈ చర్చల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వాన్స్ తెలిపారు. అలాగే విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌తో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నామని వెల్లడించారు.
వివరాలు
పాకిస్థాన్‌ను వీడిన అమెరికా ప్రతినిధులు
చర్చల అనంతరం అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్‌ను వీడి వెళ్లిపోయింది. ఇక ఈ విఫలతపై ఇరాన్ కూడా స్పందించింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz), ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ఏర్పడిన తీవ్ర విభేదాలే చర్చలు విఫలమవడానికి కారణమని ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ రెండు అంశాలపై ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో శాంతి చర్చలు ప్రతిష్ఠంభనలో పడినట్లు వెల్లడించింది.