LOADING...
Keir Starmer: బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా.. లేబర్ పార్టీకి కొత్త నాయకత్వం!
బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా.. లేబర్ పార్టీకి కొత్త నాయకత్వం!

Keir Starmer: బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా.. లేబర్ పార్టీకి కొత్త నాయకత్వం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer)సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో పార్టీకి కొత్త నాయకుడి ఎంపికతో పాటు దేశానికి కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని వారాలుగా స్టార్‌మర్‌పై రాజీనామా చేయాలంటూ తీవ్ర ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో లేబర్ పార్టీలోని ప్రముఖ నేత, మాజీ ఆండీ బర్న్‌హామ్(Andy Burnham)తన నాయకత్వాన్ని సవాల్ చేస్తానని స్పష్టం చేయడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.

వివరాలు 

హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులలో నుంచే ప్రధానమంత్రి ఎంపిక

మొదట్లో తన పదవిలో కొనసాగుతానని స్టార్మర్ ప్రకటించినప్పటికీ, పార్టీ నేతలు, సహచరులలో ఆయన నాయకత్వంపై విశ్వాసం తగ్గినట్లు సంకేతాలు కనిపించాయి. ఇటీవల బర్న్‌హామ్ మేయర్ పదవికి రాజీనామా చేసి, తన నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడంతో నాయకత్వ మార్పుపై చర్చలు వేగం పుంజుకున్నాయి. బ్రిటన్‌లో సాధారణంగా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులలో నుంచే ప్రధానమంత్రిని ఎంపిక చేసే సంప్రదాయం ఉంది. జాతీయ ఎన్నికల్లో ఘన విజయం సాధించి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు కూడా పూర్తికాకముందే స్టార్‌మర్ రాజకీయ ప్రస్థానంలో ఈ కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరుపై ప్రజల అసంతృప్తి వ్యక్తమవడం కూడా ఆయనపై ఒత్తిడి పెరగడానికి కారణమైంది.

వివరాలు 

లేబర్ పార్టీ నాయకత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను: స్టార్మర్

లండన్‌లోని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల మాట్లాడిన స్టార్మర్, తన పాలనలో చేసిన పనులను ప్రస్తావించారు. అనంతరం పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "తదుపరి ఎన్నికలకు పార్టీని నడిపించడానికి నేను సరైన వ్యక్తినేనా అనే ప్రశ్నను నా పార్టీ అడుగుతోంది. ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానాన్ని నేను గౌరవంగా అంగీకరిస్తున్నాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాల కోసమే" అని ఆయన పేర్కొన్నారు. "లేబర్ పార్టీ నాయకత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను" అని స్టార్‌మర్ అధికారికంగా ప్రకటించారు. తన ప్రసంగం చివర్లో కుటుంబం గురించి, ముఖ్యంగా తన పిల్లలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. వారే తన జీవితంలో అత్యంత గర్వకారణమని పేర్కొన్నారు.

Advertisement