UK Parliament: బ్రిటన్ పార్లమెంటులో సిక్కుల కృపాణంపై సుదీర్ఘ చర్చ.. హత్యకేసుతో మళ్లీ వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
సిక్కు మత విశ్వాసాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన కృపాణం (కత్తి) ధరించే హక్కుపై బ్రిటన్ పార్లమెంటులో మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాది చివర్లో సౌతాంప్టన్‌లో జరిగిన విద్యార్థి హెన్రీ నోవాక్ (18) హత్యకేసులో నిందితుడిగా ఉన్న విక్రం దిగ్వా (23)కు సోమవారం కోర్టు జీవిత ఖైదు విధించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌లో స్థిరపడిన సిక్కు కుటుంబానికి చెందిన విక్రం దిగ్వా, జాతి వివక్షకు సంబంధించిన వ్యాఖ్యల నేపథ్యంలో హెన్రీ నోవాక్‌తో ఘర్షణకు దిగినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాన్ని కోర్టులో ప్రదర్శించగా, అది తమ మత విశ్వాసాల్లో భాగమైన కృపాణమని విక్రం పేర్కొన్నాడు.
వివరాలు
సమాజంలో విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను సమర్దించం : కీర్ స్టార్మర్
ఈ పరిణామం పార్లమెంటులో చర్చకు దారితీయగా, కొందరు ఎంపీలు సిక్కులు ధరించే కృపాణాల వినియోగంపై కఠిన నిబంధనలు లేదా ఆంక్షలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఘటనను ఆధారంగా చేసుకుని సమాజంలో విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తాను సమర్థించనని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. హత్య అత్యంత విషాదకరమైనదేనని, కానీ దానిని ఒక మతం లేదా వర్గంపై ముద్ర వేయడానికి ఉపయోగించకూడదని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ హోంమంత్రి షబానా మహమూద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి చేసిన దారుణమైన చర్యకు మొత్తం సిక్కు సమాజాన్ని బాధ్యులుగా చూడటం సరికాదని ఆమె అన్నారు.
వివరాలు
సిక్కు సమాజ ప్రతినిధులతో హోంమంత్రి షబానా మహమూద్ ప్రత్యేక సమావేశం
బ్రిటన్‌కు సిక్కు సమాజం చేసిన సేవలను గుర్తు చేస్తూ, రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో వేలాది మంది సిక్కులు తమ తలపాగాలు, కృపాణాలు ధరించిన బ్రిటిష్ సైనికులతో కలిసి దేశం కోసం పోరాడారని లేబర్ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ దేశీ తెలిపారు. ఈ వివాదంపై మరింత చర్చించేందుకు సిక్కు సమాజ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు హోంమంత్రి షబానా మహమూద్ అంగీకరించారు. కాగా, హెన్రీ నోవాక్ హత్య అనంతరం నేరస్థలం నుంచి ఆయుధాన్ని తొలగించిన కేసులో విక్రం దిగ్వా తల్లి కిరణ్ కౌర్ (53) ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు.