Page Loader
మోదీ జోక్యంతో ఉక్రెయిన్‌పై అణు దాడిని విరమించుకున్న పుతిన్; అమెరికా నివేదిక వెల్లడి 
మోదీ జోక్యంతో ఉక్రెయిన్‌పై అణు దాడిని విరమించుకున్న పుతిన్; అమెరికా నివేదిక వెల్లడి

మోదీ జోక్యంతో ఉక్రెయిన్‌పై అణు దాడిని విరమించుకున్న పుతిన్; అమెరికా నివేదిక వెల్లడి 

వ్రాసిన వారు Stalin
Mar 11, 2024
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. రష్యా 2022 చివరిలో ఉక్రెయిన్‌పై అణు దాడికి ప్లాన్ చేసినట్లు, ఈ దాడిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కొన్ని దేశాల నేతలు ప్రధాన పాత్ర పోషించారని ఇద్దరు అమెరికా అధికారుల వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ నివేదిక పేర్కొంది. ఖేర్సన్‌లో ఉక్రెయిన్ చేతిలో రష్యా సైన్యం ఎదురుదెబ్బలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు పుతిన్ అణు దాడికి ప్లాన్ సీఎన్‌ఎన్‌ నివేదిక వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాటు చైనా వంటి దేశాలు పుతిన్‌ను అణు బాంబు దాడి ప్రణాళికలను విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చారు.

రష్యా

ఉక్రెయిన్ సైన్యం రష్యాను ఎప్పుడు ఇబ్బంది పెట్టిందంటే? 

2022లో ఉక్రెయిన్‌లో రష్యాకు పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో వ్యూహాత్మక అణ్వాయుధాలను పుతిన్ ఉపయోగించవచ్చని నాడు అమెరికన్ అధికారులు ఆందోళన చెందారు. ముఖ్యంగా దక్షిణాన రష్యా ఆధీనంలో ఉన్న ఖేర్సన్‌ను ఉక్రెయిన్ దళాలు మళ్లీ స్వాధీనం చేసుకోవడానికి ముందుకు సాగిన సమయంలో పుతిన్ సేనకు తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఖేర్సన్‌పై ఉక్రెయిన్ దళాలు ఆదిపత్యాన్ని ప్రదర్శించాయి. ఈ సమయంలో ఖేర్సన్‌లో ముందుకు సాగితే ఉక్రెయిన్ ఆర్మీ తమను చుట్టుముట్టి నాశనం చేయవచ్చని రష్యా ఆందోళన చెందింది. ఆ సందర్భంలోనే పరాభావాన్ని చూడలేక, ఉక్రెయిన్ ఆర్మీని చిన్నాభిన్నం చేసేందుకు పుతిన్ అణ్వాయుధాల దాడికి ప్లాన్ చేసినట్లు యూఎస్ అధికారులు పేర్కొన్నారు.

రష్యా

రష్యా గుప్పిట్లో ఉక్రెయిన్ కీలక నగరాలు

అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారతదేశం ఎల్లప్పుడూ పౌర హత్యలను ఖండించింది. యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని పిలుపునిచ్చింది. ఇది యుద్ధ యుగం కాదని ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్‌సిఓ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ చెప్పిన మాటను ప్రపంచ దేశాలు హర్షించాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫిబ్రవరి 24, 2022 న ప్రారంభమై.. ఇప్పటికీ కొనసాగుతోంది. రష్యా సైన్యం ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని అనేక నగరాలను స్వాధీనం చేసుకుంది. తూర్పు ఉక్రెయిన్‌లోని బఖ్‌ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం ఇందులో అత్యంత ముఖ్యమైనది. దీనిని ఉక్రేనియన్ రాజకీయాల కేంద్రం అంటారు. దీనికి సమీపంలో ని దొనేత్సక్‌లోని రెండు పెద్ద నగరాలపై కూడా రష్యా నియంత్రణ సాధించింది. లుహాన్స్క్ కూడా రష్యా ఆక్రమణలోనే ఉంది.