California: కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ.. ఎమర్జెన్సీని ప్రకటించిన గవర్నర్
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ (H5N1) వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 34 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర గవర్నర్ గవర్నర్ గవిన్ న్యూసమ్ ఈ వ్యాధిని అదుపులోకి తెచ్చేందుకు ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు. ఈ కేసులు దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక డెయిరీ ఫాంలోని ఆవులలో గుర్తించబడ్డాయి. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వారు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.
వైరస్ బారినపడిన డెయిరీ ఫాం ఉద్యోగులు
అయితే,ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాప్తి చెందిందని ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారు డెయిరీ ఫాం దగ్గర పని చేస్తున్న ఉద్యోగులే అని చెప్పారు. ఇక, బర్డ్‌ఫ్లూ వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకటించింది.