Joe Biden: హమాస్- ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి బైడెన్ కీలక ప్రతిపాదన
ఇజ్రాయెల్-హమస్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ ఒప్పందాన్ని హమాస్-ఇజ్రాయెల్ నాలుగు రోజుల వరకు మాత్రమే చేసుకున్నాయి. అయితే రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బందీలను హమాస్, ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తున్నంత కాలం పోరాటంలో యుద్ధ విరమణ కొనసాగుతుందని బైడెన్ అన్నారు. అంతేకాకుండా తమ ఆధీనంలో ఉన్న అమెరికన్లను హమాస్ విడుదల చేస్తుందని ఆకాంక్షించారు. అలాగే ఇజ్రాయెల్-హమస్ సమస్య పరిష్కారానికి, ఇజ్రాయెల్- పాలస్తీనా ప్రజల దీర్ఘకాలిక భద్రతకు బైడెన్ కీలక ప్రతిపాదన చేశారు. 'రెండు దేశాల పరిష్కారం' ఒక్కటే మార్గం అన్నారు.
రెండు దేశాల పరిష్కారం అంటే ఏమిటి?
'రెండు దేశాలు' పరిష్కారం అంటే.. ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనియన్ల కోసం స్వతంత్ర దేశాలను ఏర్పాటు చేయడం. ఈ ప్రతిపాదనకు అమెరికా ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడానికి ఇది ప్రాథమిక ఫ్రేమ్‌వర్క్‌గా అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఉంది. అయినా అరబ్ దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలు ఇజ్రాయెల్‌ను గుర్తించడం లేదు. ఈ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ పరస్పర దాడుల కారణంగా రెండు ప్రాంతాల్లో శాంతికి విఘాతం కలుగుతోంది. ప్రజలు అభద్రతతో జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే శాంతి నెలకొనాలంటే.. రెండు దేశాల ప్రతిపాదనను అమెరికా మరోసారి తెరపైకి తెచ్చింది.
రోజుకు 10మంది విడుదల చేస్తే తాత్కాలిక సంధిని పొడిగిస్తాం: నెతన్యాహు
ఖతార్ మధ్యవర్తిత్వంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య నాలు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో గాజాలో గత నాలుగు రోజుగా ప్రశాంతంగా ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ ఆధీనంలో ఉన్న బందీలను విడదల వారీగా విడుదుల చేస్తోంది. అయితే ఒప్పందం ముగిసిన వెంటనే గాజాలో మళ్లీ హమాస్ వేట కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అందులో భాగంగా ఆదివారం గాజాలో ఇజ్రాయెల్ సైనికులతో సమావేశమ్యారు. అలాగే, కాల్పుల విరమణ ఒప్పంద కాల సమయాన్ని పొడిగించాలని నెతన్యాహును బైడెన్ కోరారు. ఈ మేరకు నెతన్యాహుతో బైడెన్ ఫొన్‌లో మాట్లాడారు. అయితే రోజుకు 10మంది బందీలను హమాస్ విడుదల చేస్తే.. తాము తాత్కాలిక సంధిని పొడిగిస్తామని బైడెన్‌కు నెతన్యాహు వివరించారు.