Canada: 324 రకాల తుపాకీలపై కెనడా ప్రభుత్వం నిషేధం.. ఉక్రెయిన్‌కు తుపాకులను విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదన
ప్రపంచవ్యాప్తంగా తుపాకీ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు పలు దేశాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో, కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 324 రకాల తుపాకీలపై నిషేధం విధించాలని నిర్ణయించడంతో పాటు, వాటిని ఉక్రెయిన్‌కు తరలించేందుకు యోచిస్తోంది. ఈ వార్తలు పలు పత్రికల్లో వెలుగులోకి వచ్చాయి. 2020 మేలో, కెనడా 1,500 రకాల మారణాయుధాలపై నిషేధం విధించింది. అయితే, నవంబరు నాటికి 2,000కుపైగా కొత్త ఆయుధాలు వచ్చాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో, 324 రకాల ఆయుధాలపై నిషేధం అమలు చేయనున్నట్లు ప్రజా భద్రతా మంత్రి డొమినిక్ లే బ్లాంక్ వెల్లడించారు.
2020లోనే రుగర్ మినీ-14 తుపాకీ నిషేధం
వేటగాళ్లు, క్రీడాకారులు ఆ తుపాకీలను ఉపయోగించకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఈ తుపాకీలను అందించేందుకు చర్చలు జరుగుతున్నాయని, కీవ్‌కు అందించిన ప్రతి సహాయం వారి విజయానికి తోడ్పాటును అందిస్తుందని అన్నారు. కెనడాలో సామూహిక కాల్పుల ఘటనలు అరుదుగా జరుగుతాయి. కానీ ఇటీవల ఒక ప్రాంతంలో జరిగిన ఘటనలో, ఓ దుండగుడు 14 మంది మహిళలపై కాల్పులు జరిపి, అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. నిందితుడు ఉపయోగించిన రుగర్ మినీ-14 తుపాకీని 2020లోనే నిషేధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరిన్ని రకాల తుపాకీలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.