హెచ్-1బీ వీసాదారులకు కెనడా గుడ్ న్యూస్.. ఓపెన్ వర్క్ పర్మిట్ కు గ్రీన్ సిగ్నల్
అమెరికాలోని హెచ్-1బీ వీసాదారులకు కెనడా సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. దాదాపు 10 వేల మంది అమెరికన్ హెచ్-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు వీలుగా ఓపెన్ వర్క్ పర్మిట్‌ను సిద్ధం చేస్తున్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి సీన్ ఫ్రేజర్ మంగళవారం స్పష్టం చేసింది. ఫలితంగా హెచ్-1బీ వీసాదారుల కుటుంబీకులు విద్యాభ్యాసంతో పాటు ఉద్యోగం చేసుకునేందుకూ అనుమతిస్తున్నామని వివరించింది. ఈ మేరకు కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
3 ఏళ్ల వరకు ఓపెన్ వర్క్ వీసా పర్మిట్ కు కెనడా సర్కార్ పచ్చ జెండా
కెనడా, యూఎస్ దేశాల్లోని చాలా కంపెనీల్లో వేలాది మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని కెనడా సర్కార్ వెల్లడించింది. అయితే స్టేట్స్ లో పనిచేసే వారు మాత్రం ప్రత్యేక హెచ్-1బీ ఆక్యుపేషన్ వీసా కలిగి ఉంటారని గుర్తు చేసింది. జూలై 16, 2023 నాటికి అమెరికాలోని సదరు వీసా హోల్డర్లు, వారి ఫ్యామిలీస్ కెనడా వచ్చేందుకు అర్హులని పేర్కొంది. తాజా నిర్ణయం మేరకు, ఒక్కసారి ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు 3 ఏళ్ల వరకు ఓపెన్ వర్క్ వీసా పర్మిట్ అందనుంది. దీంతో దేశంలో ఏ యజమాని వద్దనైనా, ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు లైన్ క్లియర్ అయ్యింది. జీవిత భాగస్వాములు,డిపెండెంట్లూ వర్క్, స్టడీ పర్మిట్ తో తాత్కాలిక రెసిడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.