Canada-Gun Shooting-Indian killed: కెనడాలో కాల్పులు...భారతీయ యువకుడు మృతి
కెనడా (Canada) లో ఓ గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో మనదేశానికి చెందిన యువ విద్యార్థి మృతి చెందాడు. శుక్రవారం కెనడాలోని వ్యాంకోవర్ లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భారత్ లోని హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ కు చెందిన చిరాగ్ అంటిల్ (Chirag Antil) రెండేళ్ల క్రితం ఎంబీఏ చదువుకునేందుకు కెనడా వెళ్లాడు. విజయవంతంగా అక్కడ డిగ్రీ పూర్తి చేసిన చిరాగ్ అంటిల్ కెనడాలోనే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12న వ్యాంకోవర్ లో తన ఆడి కారులో బయటకు బయల్దేరిన చిరాగ్ అంటిల్ ను గుర్తు తెలియని వ్యక్తి అడ్డగించి అంటిల్ పై కాల్పులు జరిపాడు. దీంతో అంటిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల సమాచారంతో చేరుకున్న పోలీసులు
కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డోర్ తెరిచి చూడగా అంటిల్ విగతజీవిగా పడి ఉన్నాడు. వివరాలు సేకరించిన పోలీసులు అంటిల్ ను భారత్ లోని హర్యానాకు చెందిన వ్యక్తి గా గుర్తించారు. అంటిల్ మరణవార్తను అతడి తల్లిదండ్రులు చేరవేశారు. దీంతో వారు విషాదంలో మునిగిపోయారు. అంటిల్ మృత దేహాన్ని ఇండియాకు రప్పించేందుకు అతడి కుటుంబసభ్యులు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్ ను అభ్యర్థించారు. దీంతో అంటిల్ మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను వారు ఆదేశించారు. అంటిల్ పై ఎవరు కాల్పులు జరిపారు? ఎందుకు చంపారు అనే అంశాల్ని కెనడాలోని వ్యాంకోవర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.