
Canada: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో.. విజయం దిశగా దూసుకెళుతున్న మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఫలితాల(Canada Election Results)ప్రకారం, కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
ఇక ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోంది.ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను చూస్తే, లిబరల్ పార్టీ 59 స్థానాల్లో విజయాన్ని అందుకోగా,మరో 101 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటివరకు 56 స్థానాల్లో గెలిచి,ఇంకా 76స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఖలిస్థాన్‌కు మద్దతు పలికే జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కెనడా పార్లమెంటులో హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలు ఉన్నాయి.
వివరాలు
ప్రభుత్వం ఏర్పాటుకు 172మంది సభ్యుల మద్దతు అవసరం
ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలంటే కనీసం 172మంది సభ్యుల మద్దతు అవసరం.
అమెరికాతో సాగుతున్న సుంకాల యుద్ధం,అలాగే కెనడాను 51వ అమెరికా రాష్ట్రంగా కలిపేసే అంశంపై ట్రంప్ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఈ ఎన్నికలకు విశేష ప్రాధాన్యం లభించింది.
మరోవైపు, భారత్‌తో ఉన్న దౌత్య సంబంధాల్లో జరుగుతున్న విభేదాల వల్ల కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయగా,లిబరల్ పార్టీ కొత్త నాయకుడిగా మార్క్ కార్నీని ఎన్నుకుంది.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కార్నీ,ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు.
కెనడా స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 28న ఓటింగ్ జరగగా, వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం ఫలితాలు వెల్లడి అవుతూ కొనసాగుతున్నాయి.