India-Canada: భారతదేశంలో కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ
కెనడా భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసింది. దేశవ్యాప్తంగా తీవ్రవాద దాడుల ముప్పు ఉన్నందున భారత్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలని కెనడా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడంపై దౌత్యపరమైన వివాదం మధ్య కెనడా భారతదేశం నుండి 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత అడ్వైజరీ జారీ చేసి మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ దౌత్యవేత్తలు వెళ్లిపోతే శుక్రవారంలోగా వారి అధికారిక హోదాను ఏకపక్షంగా రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని తెలిపారు.
కాన్సులేట్‌లలో వ్యక్తిగత సేవలను నిలిపేసిన కెనడా
చండీగఢ్, బెంగళూరు, ముంబైలోని కాన్సులేట్‌లలో వ్యక్తిగత సేవలను కూడా కెనడా నిలిపేసింది. దీని కారణంగా, తాజా కెనడియన్ ట్రావెల్ అడ్వైజరీ ఏదైనా సహాయం విషయంలో న్యూఢిల్లీలోని "భారతదేశంలోని కెనడా హైకమిషన్‌ను సంప్రదించమని" తన పౌరులను కోరింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కోరడంతో పాటు, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కెనడా-వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే అవకాశాలున్నాయి తెలిపింది. అనవసరమైన ప్రయాణాలను నివారించాలని కెనడా తన పౌరులను కోరింది. భారతదేశంలోని పెద్ద నగరాల్లో విదేశీయులు, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కొందరు చోరీలకు పాల్పడుతుంటారు. అందుకే, రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కెనడా తమ అడ్వైజరీలో పేర్కొంది.