Canada's Intel agency: దేశ భద్రతకు సవాల్‌గా ఖలిస్తానీ తీవ్రవాదులు.. కెనడా ఇంటెలిజెన్స్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాకు చెందిన గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) విడుదల చేసిన 2025 పబ్లిక్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగుచూశాయి. కెనడాలో స్థిరపడిన కొంతమంది ఖలిస్తానీ తీవ్రవాదులు దేశ భద్రతకు, విదేశాల్లో కెనడా ప్రయోజనాలకు ముప్పుగా కొనసాగుతున్నారని నివేదిక పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం కెనడాలో ఉన్న కొద్దిమంది ఖలిస్తానీ తీవ్రవాదులు హింసాత్మక కార్యకలాపాల్లో కొనసాగుతూ నిధుల సేకరణలో కూడా పాల్గొంటున్నారు. వీరిలో కొందరు కెనడా పౌరులతో సన్నిహిత సంబంధాలు కలిగి, స్థానిక సంస్థలను ఉపయోగించి తమ అజెండాను ప్రచారం చేయడమే కాకుండా, అమాయక ప్రజల నుంచి నిధులు సేకరించి వాటిని హింసాత్మక కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని CSIS వెల్లడించింది.
వివరాలు
ఆ ఘటనకు 40 ఏళ్లు పూర్తి
ఈ హెచ్చరిక, 1985లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు దాడి ఘటనకు 40 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రావడం గమనార్హం. కెనడా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడిగా నిలిచిన ఈ ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది కెనడా పౌరులే. ఈ దాడికి కెనడా కేంద్రంగా ఉన్న ఖలిస్తానీ గుంపులతో సంబంధాలు ఉన్నవారే కారణమని అప్పట్లో వెల్లడైంది. అయితే ఈ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేది కేవలం కొద్దిమంది మాత్రమేనని CSIS స్పష్టం చేసింది. భారత్‌లో హింసాత్మక చర్యలను ప్రోత్సహించడం, నిధులు సమీకరించడం లేదా దాడులు ప్రణాళిక చేయడం వంటి కార్యకలాపాలకు కెనడాను వేదికగా ఉపయోగించే చిన్న వర్గాన్నే ఖలిస్తానీ తీవ్రవాదులుగా పరిగణిస్తున్నామని తెలిపింది.
వివరాలు
శాంతియుతంగా మద్దతు తెలపడం తీవ్రవాదం కాదు
ఇక ఖలిస్తాన్ రాష్ట్రం ఏర్పాటుకు శాంతియుతంగా మద్దతు తెలపడం తీవ్రవాదం కాదని నివేదిక స్పష్టం చేసింది. కెనడాలో కొందరు పౌరులు చట్టబద్ధంగా, శాంతియుతంగా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారని, హింసకు పాల్పడని ఇలాంటి కార్యకలాపాలను తీవ్రవాదంగా పరిగణించబోమని CSIS పేర్కొంది.