ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌కు ప్రమాదం; పాక్ మాజీ ప్రధాని కారు సేఫ్
ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌లోని వాహనం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. అయితే ఇమ్రాన్ వెళ్తున్న కారు సురక్షితంగా ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని పాకిస్థాన్ మీడియా తెలిపింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ శనివారం మధ్యాహ్నం తోషాఖానా కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇదిలా ఉంటే, ఇమ్రాన్ విచారణకు బయలు దేరిన తర్వాత లాహోర్‌లోని ఆయన ఇంటి వద్ద పీటీఐ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న శిబిరాలను పోలీసులు తొలగించే ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఇల్లు జమాన్ పార్క్ లోకి ప్రవేశించిన పోలీసులు 20 మందికి పైగా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ఇంటి ఉద్రిక్తత; పీటీఐ కార్యకర్తలపై జల ఫిరంగుల ప్రయోగం
ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద పీటీఐ కార్యకర్తల శిబిరాలను తొలగించడానికి పోలీసులు జల ఫిరంగులను ఉపయోగించారు. ఈ ఆపరేషన్ కోసం పంజాబ్ నుంచి పోలీసులు వచ్చినట్లు ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పోలీసులు దాడిని ఆయన ఖండించారు. పోలీసులు ఏ చట్టం ప్రకారం దీన్ని చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది లండన్ ప్రణాళికలో భాగమని మరోసారి స్పష్టం చేశారు. క్విడ్ ప్రోకో కేసులో పరారీలో ఉన్న నవాజ్ షరీఫ్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. తనకు అన్ని కేసులలో బెయిల్ లభించినప్పటికీ, పీడీఎం ప్రభుత్వం తనను అరెస్టు చేయాలనుకుంటన్నట్లు ఇమ్రాన్ చెప్పారు. వారి దుర్మార్గపు ఉద్దేశాలు తెలిసినప్పటికీ, తాను ఇస్లామాబాద్ కోర్టుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే తాను చట్టబద్ధమైన పాలనను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.