వెనుదిరిగిన పోలీసులు; గ్యాస్ మాస్క్ ధరించి బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్
తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో లాహోర్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారు. అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడాటానికి ఇమ్రాన్ జమాన్ పార్క్ ఇంటి నుంచి బయటికు వచ్చారు. ఆయిన గ్యాస్ మాస్క్ ధరించి బయటకు రావడం గమనార్హం. అంతకు ముందు పోలీసులు, భద్రతాదళాలు ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గర ఉన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ఈ క్రమంలో టియర్ గ్యాస్ ప్రభావం తగ్గకపోవడంతో దాని నుంచి రక్షణకు ఇమ్రాన్ ఖాన్ గ్యాస్ మాస్క్ ధరించి ఇంటి నుంచి బయటికు వచ్చారు.
మార్చి 18న కోర్టుకు హాజరవుతానని ఇమ్రాన్ హామీ
ఇమ్రాన్ ఖాన్ గ్యాస్ మాస్క్ ధరించి ఇంటి నుంచి బయటికు వచ్చిన వీడియోను పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ షేర్ చేసింది. నివాసం వెలుపల గుమిగూడిన మద్దతుదారులతో ఇమ్రాన్ మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది కూడా జమాన్ పార్క్ నుంచి బయలుదేరడం కనిపించింది. మంగళవారం నుంచి ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆయన మద్దతుదారులు సాధ్యం కానివ్వలేదు. మద్దతుదారులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం బాష్పవాయువు గోళాలు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఇరువైపులా పలువురు గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. మార్చి 18న కోర్టుకు హాజరవుతానని తాను ఇప్పటికే హామీ ఇచ్చినట్లు ఇమ్రాన్ పేర్కొన్నారు.