రణరంగంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఇల్లు; మద్దతుదారులపై బాష్పవాయువు ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు, బలగాల మధ్య పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల మధ్య కొన్ని గంటలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
లాహోర్‌లోని ఇమ్రాన్ ఇంటి వెలుపల పరిస్థితి రణరంగంగా మారింది. మంగళవారం సాయంత్రం నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నిస్తుండగా ఆయన మద్దతుదారులు వందలాదిగా అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది.
దీంతో పోలీసులు ఎంత ప్రయత్నించినా ఇమ్రాన్ మద్దతుదారులు అతని ఇంటి నుంచి కదలకపోవడంతో బుధవారం ఉదయం బాష్పవాయువు గోళాలు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు.
ఈ ఘర్షణల్లో ఇరువైపులా పలువురు గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు.
ఇమ్రాన్
'లండన్ ప్రణాళిక'లో భాగంగానే నా అరెస్టు: ఇమ్రాన్
తన అరెస్టు వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఉన్న అన్ని కేసులను కొట్టివేసే 'లండన్ ప్రణాళిక'లో భాగంగానే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు ఇమ్రాన్ ఆరోపించారు.
తనను జైలులో పెట్టడానికి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీని లేకుండా చేయడానికి నవాజ్ షరీఫ్‌పై అన్ని కేసులను ఎత్తి వేయడానికి అక్కడ ఒప్పందం కుదిరిందని విమర్శలు గుప్పించారు.
మార్చి 18న కోర్టుకు హాజరవుతానని తాను ఇప్పటికే హామీ ఇచ్చినట్లు ఇమ్రాన్ పేర్కొన్నారు.
పోలీసులు తనను అరెస్టు చేసి జైలుకు పంపడానికి వచ్చారన్నారు. తనను జైలుకు పంపినా, చంపినా ప్రభుత్వమే బాధ్య వహించాలన్నారు. ఇమ్రాన్ ఖాన్ లేకపోయినా ఈ దేశం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.