LOADING...
South Africa: సోఫాలో దాచిన కోట్ల నగదు.. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిపై మళ్లీ అభిశంసన ముప్పు

South Africa: సోఫాలో దాచిన కోట్ల నగదు.. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిపై మళ్లీ అభిశంసన ముప్పు

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక ఫామ్‌హౌస్‌లో సోఫాలో దాచిన కోట్ల రూపాయల విదేశీ నగదు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా రాజకీయాలను కుదిపేస్తోంది. 'ఫామ్‌గేట్' స్కామ్‌గా ప్రాచుర్యం పొందిన ఈ వివాదం కారణంగా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై మళ్లీ అభిశంసన ముప్పు ఏర్పడింది. ఈ కేసులో గతంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధం కాదని సౌతాఫ్రికా రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పు ఇవ్వడంతో వ్యవహారం మరోసారి వేడెక్కింది.

వివరాలు 

'ఫామ్‌గేట్' కేసు ఏంటి?

2020లో రామఫోసాకు చెందిన 'ఫల ఫల' ఫామ్‌హౌస్‌లో దొంగతనం జరిగింది. అక్కడి సోఫాలో దాచిన భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ డబ్బు గేదెల విక్రయం ద్వారా వచ్చిన చట్టబద్ధమైన ఆదాయమని రామఫోసా వివరణ ఇచ్చారు. ఆయన ప్రకారం మొత్తం 5.8 లక్షల డాలర్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు మాత్రం అక్కడ దాచిన మొత్తం సుమారు నాలుగు మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఆరోపించారు. దీంతో అంత పెద్ద మొత్తంలో విదేశీ నగదు దేశంలోకి ఎలా వచ్చింది? బ్యాంకులో భద్రపరచకుండా సోఫాలో ఎందుకు దాచారు? అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

వివరాలు 

మళ్లీ తెరపైకి అభిశంసన ప్రక్రియ

ఈ వ్యవహారంపై 2022లో స్వతంత్ర ప్యానెల్ విచారణ చేపట్టింది. రామఫోసా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు ఆ ప్యానెల్ నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ అధికార ఏఎన్‌సీ పార్టీ తన మెజారిటీ బలంతో పార్లమెంట్‌లో తదుపరి విచారణను అడ్డుకుంది. అయితే పార్లమెంట్ తీసుకున్న ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజ్యాంగంలోని సెక్షన్ 89 ప్రకారం అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియను నేషనల్ అసెంబ్లీ మళ్లీ ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు ఈ వ్యవహారం అధికార పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.

Advertisement

వివరాలు 

రాజీనామా చేయనంటున్న రామఫోసా

తనపై పెరుగుతున్న ఒత్తిడిని రామఫోసా తీవ్రంగా ఖండించారు. తాను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని, రాజీనామా చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, ప్యానెల్ నివేదికను కోర్టుల్లో సవాల్ చేస్తానని వెల్లడించారు. అయితే అధ్యక్షుడిపై అభిశంసన విజయవంతం కావాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం అధికార ఏఎన్‌సీ పార్టీకి సుమారు 40 శాతం సీట్లు మాత్రమే ఉండటంతో తక్షణ ప్రమాదం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ 'ఫామ్‌గేట్' వివాదం రామఫోసా రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement