LOADING...
Israel Tactical Pause: గాజాలో మానవతా సహాయం కోసం కాల్పుల విరమణ: ఇజ్రాయెల్ కీలక ప్రకటన
గాజాలో మానవతా సహాయం కోసం కాల్పుల విరమణ: ఇజ్రాయెల్ కీలక ప్రకటన

Israel Tactical Pause: గాజాలో మానవతా సహాయం కోసం కాల్పుల విరమణ: ఇజ్రాయెల్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజాలో నెలకొన్న ఆహార కొరత, మానవతా సంక్షోభం నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించిన ప్రకారం, మానవతా సహాయాన్ని అందించేందుకు రోజూ కొన్ని గంటలపాటు దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న గాజా ప్రాంతాల్లో ఈ కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ ప్రకటన మేరకు, గాజాలోని అల్ మావాసీ, దయిర్ అల్ బలాహ్, గాజా సిటీ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకూ ఇజ్రాయెల్ మిలిటరీ చర్యలు ఉండవు. అయితే మిగతా ప్రాంతాల్లో మాత్రం దాడులు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇది తాత్కాలికంగా అమలులో ఉండగా, తదుపరి ఆదేశాల వరకు కొనసాగనుంది.

Details

మనవతా సాయం కోసం ప్రత్యేక మార్గాల గుర్తింపు

గాజాకు మానవతా సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక మార్గాలను గుర్తించినట్టు పేర్కొంది. ఈ మార్గాల్లో ప్రతి రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆహారం, ఔషధాలు, ఇతర అవసరమైన సరఫరాలను తరలించవచ్చని తెలిపింది. సామాన్య పౌరులకు కూడా ఈ మార్గాల్లో రాకపోకలపై అనుమతి ఇచ్చినట్టు ప్రకటించింది. ఈ మార్గాలు జూలై 27 నుంచి శాశ్వతంగా అందుబాటులోకి రానున్నాయి. ఇజ్రాయెల్ ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపుల అనంతరం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. మరోవైపు శనివారం నుంచి హెలికాఫ్టర్ల ద్వారా గాజాకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం ప్రారంభించినట్టు వెల్లడించింది.

Details

వస్తువుల డ్రాప్‌కు అనుమతి

అంతేకాదు, ఇతర దేశాల మానవతా సాయం కోసం గగనపథంలో నుంచి వస్తువుల డ్రాప్‌కు శుక్రవారం అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు పలు దేశాలు గాజాకు పెద్ద ఎత్తున సాయం పంపిస్తున్నాయి. ఈజిప్టు నుంచి కూడా సరఫరా ప్రారంభమైంది. ఈ ఆహార, ఔషధాల కొరత నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సంభవిస్తున్న మానవీయ సంక్షోభంపై హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ తాత్కాలిక కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంది.