LOADING...
H1B visa: హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు
హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

H1B visa: హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌-1బీ వీసా వ్యవస్థను గ్రీన్‌కార్డు పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఓ రిపబ్లికన్‌ సభ్యుడు కొత్త ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు చిప్‌ రాయ్‌ గురువారం 'అమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌' పేరుతో ఈ బిల్లును సభ ముందుంచారు. ఈ బిల్లులో విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక పరిమిత కాలం పాటు అమెరికాలో పనిచేసేందుకు అనుమతించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాలని ప్రతిపాదించారు.

వివరాలు

దుర్వినియోగం చేశారని ఆరోపణ

ఈ సందర్భంగా చిప్‌ రాయ్‌ మాట్లాడుతూ, దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమలులో ఉన్న హెచ్‌-1బీ వీసా వ్యవస్థ విస్తృతంగా దుర్వినియోగానికి గురైందని ఆరోపించారు. చౌకైన విదేశీ కార్మికులను నియమించుకోవడం కోసం అమెరికాలోని సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) రంగాలకు చెందిన స్థానిక ఉద్యోగార్థులను పక్కన పెడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ ఆధారిత హెచ్‌-1బీ వీసా కేటాయింపు విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ప్రతిభ, నైపుణ్యం, వాస్తవ వేతన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే అమెరికన్‌ వైట్‌-కాలర్‌ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం కల్పించే విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు.

వివరాలు

భారతీయులు లక్ష్యం కాదన్న అమెరికా

ఈ బిల్లుకు యూఎస్‌ టెక్‌ వర్కర్స్‌, ఇమిగ్రేషన్‌ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్‌, ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ రిఫార్మ్‌ వంటి సంస్థలు మద్దతు ప్రకటించాయి. హెచ్‌-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసే ప్రయత్నాల నేపథ్యంలో భారతీయుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తమ వీసా చట్టాలు ప్రత్యేకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించలేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ పేర్కొన్నారు. అన్ని దేశాలకు ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు వీసా చట్టాలను సమర్థంగా అమలు చేయలేదని, అయితే ప్రస్తుతం వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

Advertisement