LOADING...
Nikki Haley: చైనా నుంచి క్షిపణి రసాయనాలా?.. ఇరాన్ నౌకపై నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు 
చైనా నుంచి క్షిపణి రసాయనాలా?.. ఇరాన్ నౌకపై నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు

Nikki Haley: చైనా నుంచి క్షిపణి రసాయనాలా?.. ఇరాన్ నౌకపై నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనాన్ని లెక్కచేయకుండా ప్రయాణిస్తున్న ఇరాన్‌కు చెందిన నౌకను అమెరికా నౌకాదళం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, రిపబ్లికన్ పార్టీ ప్రముఖ నేత, భారత వంశావళికి చెందిన Nikki Haley సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తున్న ఈ నౌకలో క్షిపణుల తయారికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

వివరాలు 

చైనా నుంచి వస్తున్న ఈ నౌక ఇరాన్‌కు చైనా సాయానికి నిదర్శనమన్న హేలీ

"ఈ వారాంతంలో హర్మూజ్ జలసంధిలో అమెరికా పట్టుకున్న నౌక చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తోంది. ఇందులో క్షిపణుల కోసం ఉపయోగించే రసాయన సామగ్రి ఉంది. ఆగాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ నౌక ఆగలేదు" అని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు, ఇరాన్ ప్రభుత్వానికి చైనా మద్దతు ఇస్తోందన్న అంశాన్ని ఇకపై నిర్లక్ష్యం చేయలేమని ఆమె స్పష్టం చేశారు. ఇక, అమెరికా దళాలు 'టౌస్కా' అనే ఇరాన్ జెండా కలిగిన కంటైనర్ నౌకను గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో, ఇరాన్‌కు చెందిన చాబహార్ నౌకాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ నౌక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ షిప్పింగ్ లైన్స్ సంస్థకు చెందినదిగా గుర్తించారు.

వివరాలు 

అమెరికా చర్యను 'సాయుధ దోపిడీ'గా అభివర్ణించిన ఇరాన్

అమెరికా చర్యపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని "సాయుధ దోపిడీ"గా అభివర్ణిస్తూ, దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఎలాంటి చర్చలకు హాజరుకాబోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ సమాచారం ప్రకారం,ఈ నౌకలో సైనిక, పౌర అవసరాలకు ఉపయోగించే ద్వంద్వ వినియోగ వస్తువులు ఉండే అవకాశముందని అమెరికా భద్రతా వర్గాలు ప్రాథమికంగా భావిస్తున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తోందన్న ఆరోపణలతో అమెరికా ఇప్పటికే 2019లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ షిప్పింగ్ లైన్స్ సంస్థపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Advertisement