Chevron Executive: ఇంధన వ్యయాన్ని తగ్గించాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగి ప్రజలపై భారంగా మారాయి. ముఖ్యంగా అమెరికాలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ప్రముఖ చమురు సంస్థ షెవ్రాన్‌కు చెందిన ఉన్నత అధికారి ఆండీ వాల్జ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. పెరిగిన ధరల నుంచి బయటపడాలంటే ప్రజలు తమ వాహనాల వినియోగాన్ని తగ్గించి, ఇంధనాన్ని జాగ్రత్తగా వినియోగించాలని ఆయన సూచించారు. ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ,ఇంధనం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత అవసరమైందని, దాన్ని ఎప్పుడూ పొదుపుగా ఉపయోగించాల్సిందేనని ఆయన వివరించారు.
వివరాలు
హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు
అయితే ఈ వ్యాఖ్యలపై అనేక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ సముద్ర మార్గంలో చమురు, సహజవాయువు రవాణాలో సుమారు ఇరవై శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. ఈ కీలక మార్గాన్ని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకోవడంతో గల్ఫ్ ప్రాంత దేశాలపై ఆధారపడిన అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదలగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిపై వాల్జ్ స్పందిస్తూ, ఇది అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధించిన సమస్య అని చెప్పారు. కేవలం ఒక దేశం కోసం ధరలను వెంటనే తగ్గించే సాధ్యమైన పరిష్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
ఈ నెల 22తో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో అత్యుత్తమమైన తమ నౌకాదళం ఈ జలసంధిలోకి వచ్చే, వెళ్లే నౌకలను నిలిపివేస్తుందని ఆయన ప్రకటించారు. ఇరాన్ వైఖరిలో మార్పు వచ్చే వరకు ఈ చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య అమల్లో ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 22తో ముగియనుంది.