అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 40 రోజులైనా సజీవంగా చిన్నారులు
అమెజాన్ అడవుల్లో 40 రోజుల క్రితం జరిగిన ఓ విమాన దుర్ఘటనలో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయారని అనుకున్న 4 పిల్లలు తిరిగి బతికొచ్చిన ఓ మహాద్భుతం దక్షిణ అమెరికా పరిధిలోని కొలంబియాలో గల అమెజాన్ దట్టమైన అడవుల్లో చోటు చేసుకుంది. ఈ కారడవిలో నిత్యం క్రూరమృగాలు సంచరింస్తుంటాయి. అలాంటిది 40 రోజుల క్రితం తప్పిపోయి ఎట్టకేలకు సజీవంగా బయటకు రావడం నిజంగా విశేషమే. శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే 1న సదరు విమానం బయలుదేరింది. అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని అరారాక్యూరా నుంచి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలను గుర్తించిన పైలట్ వేగంగా ప్లైట్ కూలబోతోందన్న విషయం ప్రయాణికులతో చెప్పాడు.
ఆ ఆధారాలు కనిపించగానే ఆశలు సజీవంగా నిలిచాయి
మే 16న, అంటే ప్రమాదం జరిగిన 2 వారాల తర్వాత విమాన శకలాలను గుర్తించగా, అందులో పైలట్, చిన్నారుల తల్లి, గైడ్ మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 'ఆపరేషన్ హోప్' పేరిట సహాయక చర్యలను పరుగులు పెట్టించారు. అయితే ఘటనా స్థలంలో 4,9,13 ఏళ్ల చిన్నారులు సహా 11 నెలల పసిబిడ్డలను వెతకగా ప్రమాద స్థలంలో ఎవరూ కనిపించలేదు. దీంతో వీరి కోసం 150 మంది సైనికులు, జాగీలాలతో అటవీని ముమ్మురంగా గాలించారు. ఈ క్రమంలో మే 18న పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలిపేలా పలు ఆధారాలు జవాన్ల కంటపడ్డాయి. చిన్నారులకు సంబంధించిన చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, పాల సీసా, సగం తిన్న పండు కనిపించడంతో అధికారుల్లో ఆశలు చిగురించాయి.
వారు అడవి పిల్లలు, కొలంబియాకు కూడా వారసులే : ప్రెసిడెంట్ పెట్రో
గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అటవీలో హెలికాప్టర్ల సాయంతో ఆహార పదార్థాలను బాక్సుల రూపంలో కిందకు జార విడిచారు. బాధిత చిన్నారులకు అవే ఆసరా అయ్యాయని అధికారులు భావిస్తున్నారు. నలుగురు చిన్నారుల వద్దకు సైనికులు వెళ్లే క్రమంలో పిల్లలు ఒంటరిగానే ఉన్నారని కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో వెల్లడించారు. చాలా రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కనిపించడం కొలంబియాలో పండగ వాతావరణం సృష్టించింది. సైనికులతో చిన్నారులు ఉన్న దృశ్యాలను ఆ దేశ ఆర్మీ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. తమ ప్రయత్నాలు ఫలించాయని అని రాసుకొచ్చారు. ఈ అడవే వారిని రక్షించిందని, వారు అడవి పిల్లలు అని, కొలంబియాకు వారసులేనని ప్రెసిడెంట్ పెట్రో ఆనందపడ్డారు.