China: చైనాలో ప్రతి రోజూ ఒక కొత్త బిలియనీర‍్.. 30 ట్రిలియన్ యువాన్ లు దాటిన ధనవంతుల ఆస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో ధనవంతుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. హురూన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం, చైనాలో గత ఏడాది దాదాపు ప్రతి రోజూ ఒక కొత్త బిలియనీర్ పుట్టాడు. దీంతో దేశంలో ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హురూన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన తాజా చైనా రిచ్ లిస్ట్ ప్రకారం, స్టాక్ మార్కెట్‌లలో బుల్ రన్ కారణంగా ధనవంతుల వర్గం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా "న్యూ ఎకానమీ" కంపెనీల నాయకులు ఈ వృద్ధికి ప్రధాన లాభదారులుగా నిలిచారు. ఈసారి లిస్ట్‌లో కనీసం 5 బిలియన్ యువాన్ (సుమారు 702 మిలియన్ అమెరికన్ డాలర్లు) నికర ఆస్తులు కలిగిన 1,434 మంది చోటు దక్కించుకున్నారు.
వివరాలు
గత ఏడాదితో పోల్చితే 31 శాతం పెరుగుదల
ఇది గత ఏడాదితో పోల్చితే 340 మందికిపైగా (31 శాతం) పెరుగుదలగా ఉంది. వీరి సంపద మొత్తం కలిపి 30 ట్రిలియన్ యువాన్‌లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 42 శాతం అధికం. నాంగ్‌ఫు స్ప్రింగ్ అనే చైనాలో అతిపెద్ద బాటిల్ వాటర్ కంపెనీని నియంత్రించే జోంగ్ షాన్‌షాన్ (71) తన ఆస్తి 56 శాతం పెరిగి 530 బిలియన్ యువాన్‌కి చేరడంతో మళ్లీ రిచ్ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు. గత సంవత్సరం మొదటి స్థానంలో ఉన్న బైట్‌డ్యాన్స్ (టిక్‌టాక్ యజమాని) వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ 34 శాతం వృద్ధితో 470 బిలియన్ యువాన్ ఆస్తి కలిగినప్పటికీ రెండో స్థానానికి పడిపోయారు.
వివరాలు
చైనా,హాంకాంగ్,మకావు,తైవాన్‌లలోని బిలియనర్ల
హాంకాంగ్ ధనవంతులైన లీ కా-షింగ్ (97), ఆయన కుమారుడు విక్టర్ లీ (61) సంపద 18 శాతం పెరిగి 235 బిలియన్ యువాన్‌కి చేరింది. అయితే మొత్తం చైనా రిచ్ లిస్ట్‌లో వారు ఆరో స్థానం నుండి తొమ్మిదవ స్థానానికి దిగారు. 1999లో హురూన్ లిస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి చైనా, హాంకాంగ్, మకావు, తైవాన్‌లలోని బిలియనీర్లను ఈ సంస్థ గమనిస్తోంది. హురూన్ చైర్మన్ రుపర్ట్ హూగ్‌వెర్ఫ్ మాట్లాడుతూ, "ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో బిలియనీర్ల సంఖ్య పెరగడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. స్టాక్ మార్కెట్‌లోని బలమైన ర్యాలీ దీనికి కారణం" అన్నారు. టెక్నాలజీ రంగంలో కొత్త ముఖాలు, ఎగుమతుల పెరుగుదల ఈ బిలియనీర్ క్లబ్‌ను మరింత విస్తరించాయని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
గణనీయమైన వృద్ధిని నమోదు చేసిన చైనా ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు
స్టాక్ ధరల ఆధారంగా సెప్టెంబర్ 1 వరకు ఆస్తులను అంచనా వేశారు. గత ఏడాదిలో చైనా ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు విద్యుత్ వాహనాలు (EVs), బయోటెక్, కంప్యూటింగ్ రంగాలపై విశ్వాసం చూపారు. షెన్‌జెన్ స్టాక్ ఎక్స్చేంజ్ 54 శాతం,షాంఘై కంపోజిట్ ఇండెక్స్ 36 శాతం,హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 42 శాతం పెరిగాయి. ఇందులో 100 బిలియన్ యువాన్ కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు 41 మంది ఉండగా, ఇది గత ఏడాది 26 మంది నుండి 59 శాతం పెరుగుదల. అలాగే 1,021 మంది ఒక్కొక్కరు కనీసం 1 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ఇది 36 శాతం వృద్ధి.
వివరాలు
మూడో త్రైమాసికంలో 4.8 శాతంగా చైనా ఆర్థిక వృద్ధి
షాంఘైకి చెందిన ఆర్థిక సలహా సంస్థ "ఇంటిగ్రిటీ" కన్సల్టెంట్ డింగ్ హైఫెంగ్ మాట్లాడుతూ, "ఈ రిచ్ లిస్ట్ గణాంకాలు చైనా ఆర్థిక పరిస్థితులపై ఉన్న నిస్పృహను కొంతవరకు తిప్పికొడుతున్నాయి. విద్యుత్ వాహనాలు, రోబోటిక్స్ వంటి హై గ్రోత్ కంపెనీలు కొత్త వృద్ధి ఇంజిన్‌లుగా అవతరించాయి" అన్నారు. చైనా ఆర్థిక వృద్ధి (GDP) మూడో త్రైమాసికంలో 4.8 శాతంగా నమోదయింది. ఇది రెండో త్రైమాసికంలోని 5.2 శాతం కంటే తక్కువ. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, రియల్ ఎస్టేట్ రంగంలోని సమస్యలు చైనా ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం చూపుతున్నాయి. అయినా కూడా ఆటోమోటివ్ సరఫరా శ్రేణి, బయోటెక్నాలజీ రంగాల్లో గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీలు విదేశీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వివరాలు
హాంకాంగ్ బోర్స్ ప్రపంచ IPO ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి, ప్రధానంగా మెయిన్‌లాండ్ చైనాకు చెందిన 66 కంపెనీలు హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో షేర్ల విక్రయాల ద్వారా మొత్తం 23.27 బిలియన్ అమెరికన్ డాలర్లు సమీకరించాయి. దీని వలన హాంకాంగ్ బోర్స్ ప్రపంచ IPO ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఇందులో చైనా ప్రముఖ EV బ్యాటరీ తయారీదారు కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ, గోల్డ్ మైనింగ్ దిగ్గజం జిజిన్ గోల్డ్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది ప్రపంచంలో అతిపెద్ద షేర్ ఆఫరింగ్స్‌గా నిలిచాయి.