చైనా: బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి.. ఆరుగురు గల్లంతు
చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్ ప్రాంతంలో భారీవర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం వరకు 21 మంది మరణించగా మరో ఆరుగురు అదృశ్యమైనట్లు గ్లోబల్ టైమ్స్ నివేదించింది. చాంగాన్ జిల్లా శివార్లలోని లువాన్‌జెన్ టౌన్‌షిప్‌లో వీజిపింగ్ గ్రామంలో బురద జలాలు ముంచెత్తాయి. ఈ విపత్తు కారణంగా జాతీయ రహదారి పక్కన ఇళ్లు దెబ్బతిన్నాయి.భారీవర్షాల వల్ల పలు ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. వరదల నేపథ్యంలో జియాన్ నగరం వెంటనే ఆన్‌సైట్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.వరదపీడిత ప్రాంతాల్లో 980 కంటే ఎక్కువ మంది అగ్నిమాపక,పోలీసు విభాగాల సిబ్బంది సహా 14 రెస్క్యూ బృందాలను మోహరించారు. గ్రామంలోని రెండు ఇళ్లు,సమీపంలోని రోడ్లు, వంతెనలు, విద్యుత్తు సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.