Page Loader
కుదేలైన చైనా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. 57 వేల కోట్ల భారీ నష్టం
కుదేలైన చైనా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. 7.6 బిలియన్ డాలర్ల నష్టం

కుదేలైన చైనా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. 57 వేల కోట్ల భారీ నష్టం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 11, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే బలమైన దేశాల్లో ఒకటిగా నిలిచిన చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంలో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఇప్పటికే ఆ దేశ దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఎవర్‌ గ్రాండే రూ.6 లక్షల కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది. గురువారం మరో అతిపెద్ద డెవలపర్‌ కంట్రీ గార్డెన్‌ తొలి ఆరు నెలల్లోనే సుమారుగా 7.6 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 57వేల కోట్లు) నష్టం వాటిలినట్లు వెల్లడించింది. అంతర్గతంగా చైనాలో నెలకొన్న ఆర్థిక స్థితుగతులు, ద్రవ్యోల్బణం, కంట్రీ గార్డెన్‌ పరిస్థితికి కారణాలుగా తెలుస్తోంది. జులైలో 14.5శాతం మేర ఎగుమతులు డిలా పడ్డాయి. కొత్తగా 11.58 మిలియన్ల పట్టభద్రులు ఉద్యోగ వేటలో ఉండటం గమనార్హం.

details

కంట్రీ గార్డెన్ రేటింగ్‌లో కోతలు విధించిన మూడీస్ సంస్థ

చైనాలో ఆర్థిక మాంద్యంతో హాంకాంగ్‌ మార్కెట్లో కంట్రీ గార్డెన్‌ షేర్ల ధరలు దాదాపు 10 శాతం మేర పతనమయ్యాయి. జూన్‌ 30తో తొలి 6 నెలల కాలాన్ని నష్టాలతో ముగించింది. గతేడాది మాత్రం 265 మిలియన్‌ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుతం సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కంపెనీ ఛైర్మన్‌ యాంగ్‌ హుయాన్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైనట్లు వివరించింది. మరోవైపు గురువారం ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ కంట్రీ గార్డెన్ రేటింగ్‌లో కోతలు విధించింది. నగదు కోసం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకునట్లు పేర్కొంది. చైనాలో ఇంచుమించు 3 వేల హౌసింగ్‌ ప్రాజెక్టులను దక్కించుకున్నఈ సంస్థలో దాదాపు 70 వేల మంది ఉద్యోగులున్నారు.