మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల
భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా, చైనా మాత్రం తన వంకర బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతున్న విధంగా వ్యవహరిస్తుంది. మరోసారి భారత్‌పై బీజింగ్ తన అక్కసును వెల్లగక్కింది. భారత్‌లో అంతర్భంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా భూభాగంగా పేర్కొంటూ.. అధికారికంగా మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా ప్రతిఏటా తన స్టాండర్డ్ మ్యాప్ ఎడిషన్‌ను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్ వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చు. కొత్త మ్యాప్‌లో అక్సాయ్ చిన్ ప్రాంతం, తైవాన్, దక్షిణ చైనా సముద్రం కూడా చైనా అంతర్భాగంగా పేర్కొనడం గమనార్హం.
అరుణాచల్‌లో 11 ప్రదేశాల పేర్లు మార్చిన చైనా
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమ దేశంలో ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉంటుందని భారత్ పదే పదే చెబుతున్నా చైనా మాత్రం తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు. గతంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ చైనా ఏకీకరణ లక్ష్యాన్ని ప్రతిపాదించారు. దానికి అనుగూనంగా చైనా తన ప్రధాన భూభాగంలో భాగంగా తైవాన్‌ను పేర్కొంది. అయితే దక్షిణ చైనా సముద్రంపై కూడా బీజింగ్ తన హక్కులను ప్రకటించగా.. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై తైవాన్ వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్ర భూభాగాలను తమవిగా ఆ దేశాలు చెబుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు దగ్గరగా ఉన్న పట్టణంతో సహా 11ప్రదేశాల పేర్లను చైనా తన కొత్త మ్యాప్‌లో మార్చింది. అయితే చైనా ఇలా పేర్లను మార్చడం ఇది మూడోసారి.