Divorce of the century: ఏఐ బూమ్‌తో క్లిష్టంగా మారిన విడాకుల కేసు.. మళ్లీ వార్తల్లోకి 'డివోర్స్ ఆఫ్ ద సెంచరీ'!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలో సంచలనం సృష్టించిన 'డివోర్స్ ఆఫ్ ద సెంచరీ' కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎస్‌కే గ్రూప్ ఛైర్మన్ చెయ్ తే వాన్, ఆయన మాజీ భార్య రోహ్ సో యంగ్ మధ్య కొనసాగుతున్న విడాకుల వివాదం కొత్త మలుపు తిరిగింది. దాదాపు రూ.6 వేల కోట్ల భరణం చెల్లించేందుకు చెయ్ సిద్ధమైనప్పటికీ.. ఆయన మాజీ భార్య ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ వ్యవహారం దక్షిణ కొరియా వ్యాపారవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
వివరాలు
అసలు వివాదం ఏమిటి?
దక్షిణ కొరియాలోని రెండో అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన ఎస్‌కే గ్రూప్‌నకు చెయ్ తే వాన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ గ్రూప్‌లోని ఎస్‌కే హైనిక్స్ సంస్థ ఏఐ సిస్టమ్స్‌కు అవసరమైన హై బ్యాండ్‌విడ్త్ మెమొరీ (HBM) చిప్స్ తయారీలో కీలకంగా ఉంది. దీంతో ఏఐ బూమ్‌లో ఈ సంస్థ ప్రాధాన్యం పెరిగింది.
చెయ్ తే వాన్‌కు దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్ తే వూ కుమార్తె రోహ్ సో యంగ్‌తో 1988లో వివాహమైంది.
వీరికి ముగ్గురు పిల్లలు.2015లో మరో మహిళతో తనకు సంబంధం ఉందని,ఆమెకు ఒక బిడ్డ కూడా జన్మించిందని చెయ్ బహిరంగంగా ప్రకటించడంతో వీరి వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది.
వివరాలు
కోర్టు తీర్పులతో మారిన భరణం
తొలుత విడాకులకు నిరాకరించిన రోహ్.. తర్వాత అంగీకరిస్తూ భర్త ఆస్తుల్లో వాటా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 2017 నుంచి ఈ న్యాయపోరాటం కొనసాగుతోంది.
2022లో దిగువ కోర్టు చెయ్ వద్దనున్న ఎస్‌కే గ్రూప్ షేర్లు వారసత్వ ఆస్తులని, వాటిని విభజించలేమని తీర్పునిచ్చింది.
అయితే, రోహ్ తండ్రి 1990ల్లో గ్రూప్ అభివృద్ధికి రహస్యంగా 30 బిలియన్ వోన్లు అందించారని సియోల్ హైకోర్టు పేర్కొంటూ ఆ షేర్లను ఉమ్మడి ఆస్తిగా పరిగణించింది.
ఈ తీర్పును చెయ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు అవినీతి ద్వారా వచ్చిన నిధులను ఆస్తుల వృద్ధికి ఆధారంగా తీసుకోలేమని పేర్కొంది.
దీంతో హైకోర్టు మళ్లీ విచారణ చేపట్టి, కుటుంబ నిర్వహణతోపాటు వ్యాపార అభివృద్ధిలో రోహ్ పాత్రను పరిగణనలోకి తీసుకుంది.
వివరాలు
రాజీ ప్రతిపాదనకు రోహ్ నిరాకరణ
ఉమ్మడి ఆస్తుల్లో మూడో వంతు వాటా ఇవ్వాలని ఆదేశించింది. దీంతో భరణం మొత్తం 940 మిలియన్ డాలర్ల నుంచి 644 మిలియన్ డాలర్లకు తగ్గింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.6 వేల కోట్లు.
ఈ వివాదానికి ముగింపు పలికేందుకు చెయ్ నవంబర్ 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, కోర్టు మధ్యవర్తిత్వంతో రాజీకి సిద్ధమని తెలిపారు.
అయితే రెండు రోజుల తర్వాత రోహ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. వివాదాన్ని ముగించాలంటే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను చెయ్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వివరాలు
రాజీ ప్రతిపాదనకు రోహ్ నిరాకరణ
అలా చేస్తేనే హైకోర్టు తీర్పు తుది నిర్ణయంగా నిలుస్తుంది.
మరోవైపు, ఏఐ బూమ్ కారణంగా ఎస్‌కే హైనిక్స్ షేర్ల విలువ పెరగడం కూడా ఆస్తుల పంపకాన్ని మరింత క్లిష్టంగా మార్చింది.
కోర్టు ఆదేశించిన మొత్తాన్ని చెల్లించేందుకు చెయ్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించినప్పటికీ.. గ్రూప్‌లో ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు.
ఉన్నతస్థాయి కుటుంబ నేపథ్యం, వేల కోట్ల ఆస్తుల పంపకం, ఏఐ రంగం ప్రభావం కలగలిసి ఈ కేసును 'డివోర్స్ ఆఫ్ ద సెంచరీ'గా మార్చాయి.