న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం
లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జెసిండా ఆర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో క్రిస్ హిప్కిన్స్‌కు అవకాశం వచ్చింది. వాస్తవానికి ఫిబ్రవరి 7న తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించినా, ముందుగా పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అక్టోబరు 14న న్యూజిలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాని రాక లేబర్ పార్టీలో నేతల్లో నూతనోత్సహాన్ని నింపింది. క్రిస్ హిప్‌కిన్స్‌కు లేబర్ పార్టీలో మంచి గుర్తింపు ఉంది. పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగలరనే పేరుంది. కరోనా స్వైర విహారం చేస్తున్న సమయంలో సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆర్థిక వ్యవస్థపై క్రిస్ హిప్కిన్స్ స్పెషల్ ఫోకస్
ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్రిస్ హిప్కిన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని ఒక మహమ్మారిగా అభివర్ణించారు. ఇదే సమయంలో 'కార్మెల్ సెపులోని' ఉప ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన హిప్‌కిన్స్‌కు కార్మెల్ ధన్యవాదాలు తెలిపారు. న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలు ఇంకో తొమ్మిది నెలల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేల్లో అధికార లేబర్ పార్టీ వెనుకంజలో ఉంది. ఈ సమయంలో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడం క్రిస్ హిప్కిన్స్‌కు పెద్ద సవాలే అని చెప్పాలి.