జెసిండా ఆర్డెర్న్: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన, వచ్చే నెలలో పదవికి రాజీనామా
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెలలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ తాను ప్రధాని రేసులో ఉండనని ఈ సందర్భంగా ప్రకటించారు. గురువారం నిర్వహించిన లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని ఆమె చెప్పారు. అక్టోబరు 14న న్యూజిలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని జెసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఆదివారం కొత్త ప్రధానమంత్రి ఎన్నిక
ప్రధానమంత్రిగా తాను ఐదున్నరేళ్లు చాలా కష్టపడ్డానని లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో జెసిండా ఆర్డెర్న్ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు పదవి నుంచి తప్పుకోవాల్సన సమయం ఆసన్నమైందన్నారు. తన పదవీకాలంలో కరోనా లాంటి పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. రాజకీయ నాయకురాలిగా తాను ప్రజలకు చేయగలిగింది చేసినట్లు చెప్పారు. కొత్త నాయకుడిని న్యూజిలాండ్ లేబర్ పార్టీ ఆదివారం ఎన్నుకోనుంది. సార్వత్రిక ఎన్నికల వరకు ప్రధానిగా ఆర్డెర్న్ ఉంటారు. ఫిబ్రవరి 7న ఆర్డెర్న్ రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం ఉపప్రధాన మంత్రిగా ఉన్న గ్రాంట్ రాబర్ట్‌సన్ తర్వాత ప్రధాని అవుతారని అందరూ ఊహించారు. అయితే తదుపరి లేబర్ నాయకుడిగా తాను నిలబడటం లేదని రాబర్ట్‌సన్ తెలిపారు.