2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా?
న్యూజిలాండ్ తమ దేశ ప్రజల భవిష్యత్ కోసం చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. తమ దేశ కొత్త తరాన్ని ధూమపానానికి పూర్తిగా దూరం చేసేందుకు స్మోక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులేటేడ్ ప్రొడక్ట్స్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం 2008 తర్వాత పుట్టిన వారెవరూ సిగరెట్ లేదా పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయరాదు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే ముందు 'పొగ రహిత భవిష్యత్తు వైపు ఒక అడుగు' అని న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రి అయేషా వెరాల్ పేర్కొన్నారు. ఈ చట్టం కొత్త ఏడాది నుంచి అమల్లోకి రానుంది.
2025 నాటికి స్మోకింగ్ ఫ్రీ
న్యూజిలాండ్‌లో ప్రస్తుతం 6వేల సిగరెట్ల దుకాణాలు ఉండగా.. బిల్లు ఆమోదంతో వాటిలో పదిశాతం మాత్రమే నడవనున్నాయి.ప్రస్తుతం దేశంలో 8శాతం మాత్రమే పొగతాగుతున్నారు. ఏడాదిన్నర క్రితం ధూమపానం చేసేవారి సంఖ్య 9.4శాతంగా ఉండేది. ప్రభుత్వం కఠిన నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. 2025 నాటికి న్యూజిలాండ్‌ను స్మోకింగ్ ఫ్రీ చేయాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం పని చేస్తోంది. ధూమపానం లేకపోతే..ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రజలు గడపొచ్చని, వైద్యానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని మంత్రి అయేషా వెరాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.