Ukraine Christmas: చరిత్రలో తొలిసారిగా డిసెంబర్ 25న ఉక్రెయిన్‌లో క్రిస్మస్.. రష్యా సంప్రదాయానికి చెక్
రష్యా-ఉక్రెయిన్ జరుగుతున్న వేళ.. ఐరోపాలో చారిత్రక సాంస్కృతిక మార్పు జరిగింది. రష్యా సాంస్కృతిక ఆధిపత్యానికి చెక్ పెడుతూ.. చరిత్రలో తొలిసారి ఉక్రెయిన్ డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటోంది. ఉక్రెయిన్, రష్యాలో ఎక్కువ మంది ఆర్థడాక్స్ క్రైస్తవులు ఉంటారు. దీంతో ఈ రెండు దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. రష్యా ఆధ్వర్యంలోని సోనియట్ యూనియన్‌లో ఉక్రెయిన్ భాగమైనప్పటి నుంచి జనవరి 7న క్రిస్మస్‌ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ బయటకు వచ్చినా కూడా ఆ దేశంపై రష్యా సంప్రదాయాల ప్రభావం అలాగే ఉండిపోయింది. అయితే ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో రష్యా అనుసరిస్తున్న సంప్రదాయాల ప్రభావం ఉక్రెయిన్‌పై ఏ మాత్రం ఉండకూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.
జూలియన్ క్యాలెండర్‌ను పక్కన పెట్టిన ఉక్రెయిన్
ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో జూలియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నారు. రష్యా వలె, ఉక్రెయిన్‌లో చాలామంది ప్రజలు ఆర్థడాక్స్ క్రైస్తవ మతాన్ని అనుసరించే వారు ఉన్నారు. జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 7న క్రిస్మస్ వస్తుంది. 106ఏళ్లుగా రష్యా పాటించే జూలియన్ క్యాలెండర్‌ను ఉక్రెయిన్ అనుసరిస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇక నుంచి రష్యా సంప్రదాయాలను పక్కన పెట్టాలని జూలై 2023లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బిల్లును ఆమోదించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఇప్పుడు పాశ్చాత్య దేశాల తరహాలో 'గ్రెగోరియన్ క్యాలెండర్'ని అనుసరిస్తుందని, అందుకే జనవరి 7కి బదులుగా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవాలని నిర్ణయించినట్లు బిల్లులో పేర్కొన్నారు.
ప్రపంచానికి ఉక్రెయిన్ కొత్త సందేశం
జెలెన్‌స్కీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉక్రెయిన్ దేశం మొత్తం స్వాగతించింది. ఆర్థడాక్స్ క్రైస్తవ చర్చిలు కూడా సమర్ధించారు. దీంతో ఉక్రెయిన్‌లో డిసెంబర్ 25న ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకలపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రపంచంతో కలిసి క్రిస్మస్ జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఉక్రెయిన్‌లోని ఒక వైద్యుడి తల్లి పారిషినర్ ఒలెనా అన్నారు. రష్యా ఆధిపత్యానికి సంబంధించి.. ఉక్రెయిన్ ఇప్పుడు యావత్ ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. అంతేకాదు, ఉక్రెయిన్‌లో రష్యాకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లను లేకుండా జెలెన్‌స్కీ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే రోడ్ల పేర్లు కూడా మారుస్తున్నారు. అనేక స్మారక చిహ్నాలను ఇప్పటికే తొలగించారు.
ఆర్థడాక్స్ క్రిస్మస్.. కాథలిక్ క్రిస్మస్ మధ్య వ్యత్యాసం
ఆర్థడాక్స్ క్రైస్తవులు, కాథలిక్ క్రిస్టియన్లు జరుపునే క్రిస్మస్ వేడుకల్లో కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిలు డిసెంబర్‌లో క్రిస్మస్ వారాన్ని జరుపుకుంటే, ఆర్థడాక్స్ చర్చిలు మాత్రం జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటారు. కాథలిక్ చర్చి అధిపతిని పోప్ అని పిలుచుకుంటారు. ఆర్థడాక్స్ చర్చ్ అధిపతిని పాట్రియార్క్ అని పిలుస్తారు. 11వ శతాబ్దంలో క్రైస్తవ మతం రెండు వర్గాలుగా విడిపోయింది. మొదటి రోమన్ కాథలిక్.. రెండోది ఆర్థోడాక్స్ వర్గం. రోమన్ కాథలిక్ విధానాన్ని భారత్‌తో పాశ్చాత్య దేశాలు అనుసరిస్తాయి. కానీ ఆర్థడాక్స్ విధానాన్ని రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్ దేశాల్లో మాత్రమే అనుసరిస్తారు. దీన్ని రష్యన్ ఆర్థోడాక్స్ అని కూడా అంటారు.